AP | టీడీపీ ప‌త‌నం కోరిన వాళ్లే కాల‌గర్భంలో క‌ల‌సిపోయారు – చంద్ర‌బాబు

మంగ‌ళ‌గిరి : 43ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ.. మన తెలుగుదేశం పార్టీ అని, ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో… సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు.

టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు..ఈ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంత‌రం ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్, పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు.. టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు.. నేను ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచాను.. పార్టీ పెట్టిన 9నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. టీడీపీ ఒక సంచలనం.. రాజకీయ అవసరం.. టీడీపీకి నేను టీమ్ లీడర్ ని మాత్రమే.. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు అని అన్నారు. టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు అంటూ సెటైర్లు వేశారు.

భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా… మన పసుపు జెండా… అని, దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అని ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి ఉందని, ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు స్పష్టం చేశారు. కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి.. తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగుదేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు.

క్షేత్ర స్థాయిలో ప‌నిచేస్తేనే ప‌ద‌వులు…
త‌న‌కు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావ‌ని, క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే పదవులు దక్కుతాయనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇక, 43ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు చూశాం.. చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయి.. గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు.. అలాగే టీడీపీది స్వర్ణయుగం.. ఎక్కడికక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *