TG | అసెంబ్లీలోనూ చర్చకు సై.. మైక్‌ కట్‌ చేయకుండా ఉంటే : కేటీఆర్‌

హైదరాబాద్ : సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసింది.. ముఖ్యమంత్రి రాకుంటే మంత్రులైనా చర్చకు రావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రాలేదని, అసెంబ్లీలో చర్చిద్దామంటే తమకు మైకు ఇవ్వరని చెప్పారు. అసెంబ్లీలో కాదంటే.. ప్రెస్‌క్లబ్ (Press Club) లోనైనా చర్చకు రావాలని చెప్పామన్నారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని 18నెలలుగా నిలదీస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Chief Minister Revanth Reddy) విసిరిన సవాల్‌ స్వీకరించిన కేటీఆర్‌ సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం 11 గంటలకు చర్చకు రావాలన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి తెలంగాణ భవన్‌ నుంచి సోమాజీ గూడ (Somaji Guda) ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌ బయల్దేరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్‌ రెడ్డిని ఎన్నోసార్లు ఆహ్వానించామన్నారు. రుణమాఫీ, రైతు బోనస్‌ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించామన్నారు. . దీనిపై ఆయన స్పందిస్తూ చర్చకు నేను రెడీ. ముఖ్యమంత్రి రేవంత్ ప్లేస్ చెప్పాలి, కొడంగల్‌, కొండారెడ్డిపల్లి, చింతమడక, గజ్వేల్ ఎక్కడైనా సరే వస్తా.. అని ప్ర‌తి స‌వాల్ చేశారు. అలాగే, ముఖ్య‌మంత్రి సిద్ధమయ్యేందుకు 72 గంటల గడువు ఇస్తున్నట్టు కూడా కేటీఆర్ చెప్పారు. కాగా, ఈ రోజు (జులై 8) ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తాము చర్చకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. సీఎం రేవంత్‌కు కూడా కుర్చీ వేసి ఉంచుతామని ప్ర‌తిస‌వాల్ చేసిన సంద‌ర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్రెస్ క్ల‌బ్‌లో కేటీఆర్ సిద్ధం..

తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేత‌లు ముందుగా అనుకున్న ప్రకారం మంగ‌ళ‌వారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వ‌చ్చారు. కొంత ముందుగానే తెలంగాణ భవన్‌కు చేరిన కేటీఆర్ అక్క‌డి నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రెస్ క్లబ్‌కు వ‌చ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కూడా వ‌చ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున‌ పోలీసు బలగాలను మోహరించారు.

సీఎం రేవంత్ ఢిల్లీ టూర్..

ప్రస్తుతం సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సవాల్‌పై స్పందిస్తూ ‘‘మీతో చర్చకు ముఖ్యమంత్రి ఎందుకు వస్తారు?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ‘‘నేను సీఎంతోనే చర్చిస్తాను’’ అని క్లియర్‌గా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు ‘‘దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా”అంటూ బీఆర్ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా పొలిటిక‌ల్ హీట్ రాజుకుంటోంది.

రేవంత్​కు సాధ్యం కాకుంటే చేసి చూపిస్తాం..

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ తప్పుకుంటే కేసీఆర్ చేసి చూపిస్తారు. రేవంత్ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదు. సీఎం రాకుంటే సవాల్ చేసినట్లు మంత్రులు అయినా చర్చ జరపాలి. హామీల అమలుపై 18 నెలలుగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాం. రుణ మాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానం ఇచ్చాం. రేవంత్ రెడ్డికి వీలైతే తేదీ, ప్రదేశం చెప్పాలని డిమాండ్ చేస్తున్నమని అన్నారు.

సీఎం సవాల్​ను స్వీకరించే..

సీఎం రేవంత్ రెడ్డి తమకు సవాల్​చేశారని.. కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా రండి అని సవాల్​ విసిరారని, ఈ క్రమంలోనే తాము సవాల్​ స్వీకరించి 72 గంటల సమయం ఇచ్చినట్టు కేటీఆర్​ తెలిపారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్ కు చర్చ కు రమ్మని చెప్పామని, చర్చించడానికి వ‌చ్చిన‌ట్టు తెలిపారు. సీఎం వస్తారేమో అనుకున్నామని, ఢిల్లీకి వెళ్లారు.. ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దాం అని కేటీఆర్ అన్నారు. చ‌ర్చించేందుకు ఎవరితో అయినా తాము సిద్ధమే.. ఈ రోజు కాకపోయినా మరో రోజు అయినా సీఎం రావచ్చని కేటీఆర్ అన్నారు. రేపు అసెంబ్లీలో చర్చ పెడతాం అని సీఎం మాటిస్తే దానికి కూడా తాము సిద్ధమని, మీకు పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి.. కేసీఆర్ వచ్చి పాలన చేస్తారని కేటీఆర్​ స్పష్టంచేశారు.

పోలీసుల బందోబస్తు..

మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ క్లబ్‌కు రావచ్చన్న వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విపరీతంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని, పోలీస్‌ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. కేటీఆర్ ముందుగా చెప్పినట్టు చింతమడక, కొడంగల్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఎక్కడైనా చర్చ జరపడానికి తాను సిద్ధమని ప్రకటించినప్పటికీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ను వేదికగా ఎంపిక చేశారు. రాజకీయ చర్చ పేరుతో మొదలైన ఈ పరిణామం, పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply