‘ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
- సఖ్యతకు అడ్డొస్తున్నాడనే ఘాతుకం
- హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం
- పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి..
- వీడిన అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ
- ఇద్దరు నిందితుల అరెస్ట్
చిత్తూరు,ఆంధ్రప్రభ : తన సఖ్యతకు అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. అందుకు ప్రియుడి సాయం తీసుకుని దారుణానికి ఒడిగట్టింది. ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మబలికే ప్రయత్నం చేసింది.. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో కటకటాల వెనక ప్రియుడితో కలిసి ఊచలు లెక్కబెడుతోంది. చిత్తూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇల్లాలే సూత్రధారిగా వ్యవహరించి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం చిత్తూరులో టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్యతో కలిసి డీఎస్పీ సాయినాథ్ కేసు వివరాలు వెల్లడించారు. చిత్తూరు నగరంలోని సంతపేట, దుర్గమ్మ గుడి వీధిలో నివసిస్తున్న బి.వెంకటేష్ అనే వ్యక్తికి తన రెండవ భార్య తులసి మునియమ్మ అలియాస్ కావ్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఆమె ఆర్.సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకుని వారించాడు. ఈ క్రమంలో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి.
తాడుతో గొంతుకు ఉరి బిగించి..
సఖ్యతకు అడ్డుగా ఉన్న భర్తను ఎలగైనా అంతమొందించాలని మునియమ్మ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ప్రియుడు సురేష్‌తో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో వెంకటేష్ ఇంట్లో నిద్రిస్తుండగా, ఇద్దరూ కలిసి తమ వెంట తీసుకువచ్చిన తాడుతో అతని గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం, సంఘటనను దాచిపెట్టేందుకు తాడును మంచం కింద దాచి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. నిందితులపై నిఘా ఉంచిన పోలీసులకు రాబడిన సమాచారం మేరకు తులసి మునియమ్మ అలియాస్ కావ్య , ఆమె ప్రియుడు ఆర్. సురేష్ ను అరెస్ట్ చేశారు. వీరిద్దరిని శుక్రవారం కోర్టులో హాజరపరిచి రిమాండ్‌కు పంపినున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషిచేసిన చిత్తూరు టు టౌన్ సీఐ నెట్టికంటయ్య, ఎస్సై రమేష్ బాబు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సాయినాథ్ ప్రత్యేకంగా అభినందించారు.