ELECTION| రైతు సంఘం నూతన కమిటీ ఏకగ్రీవం..

- జిల్లా అధ్యక్షులుగా చిర్ల పుల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా హరే రామ్ ఎన్నిక
ELECTION| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు బుధవారంతో ముగిశాయి. పాలకోడేరు మండలం మోగల్లులో నిర్వహించిన ఈ మహాసభలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడుగా చిర్ల పుల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆకుల హరే రామ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా కిలారి తవిటి నాయుడు, గుత్తుల శ్రీరామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శిగా తాళ్లూరి హరిహర లక్ష్మణ్, మరో సహాయ కార్యదర్శి తూ టే మార్టిన్ లో ధనరన్ తోపాటు మరో 12 మంది సభ్యులు మొత్తం 18 మందితో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అన్ని పంటలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ వారి సమస్యలపై నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ పంట కోత దశకు వచ్చిందని ఈ దశలో ముంతాన్ తుఫాన్ కారణంగా నేలకొరిగిన పొలాలను కొయ్యటానికి కోత మిషన్లు ఒక గంటకు రూ.3,500 డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో వరి కోత మిషన్లు యాజమాన్యంతో మాట్లాడి అధికారులు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఏడు తీర్మానాలు..
- ఈ మహాసభలో ధాన్యం క్వింటాలకు రూ. 500 రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలి. కేరళ తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలి.
- పాలకు గిట్టుబాటు ధర కల్పించాలి. పాడి రైతులను ఆదుకోవాలి. సబ్సిడీపై దాణా సరఫరా చేయాలి. గేదెల కొనుగోలుకు లోన్లు ఇవ్వాలి.
- కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర ప్రకటించాలి. కంపెనీల మోసాలను అరికట్టాలి. రాష్ట్ర కోకో బోర్డు ఏర్పాటు చేయాలి.
- పెంచిన ఎరువులు ధరలు తగ్గించాలి. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించాలి. జిల్లాలో సాగునీటి కాలువలు, మురుగు ట్రైన్స్, ప్రక్షాళన చేయాలి. ముంపుకు గురవుతున్న రైతులను, సాగునీరు అందనీ రైతులను ఆదుకోవాలి.
- దొంగ రావి పాలెం వద్ద ఎత్తిపోతల పథకం వెంటనే పెట్టి శివారు గ్రామాల కు సాగునీరు అందించాలి. కొల్లేరు కాంటూరును ఐదు నుంచి మూడుకు కుదించాలి. కొల్లేరు రైతాంగ సమస్యలు పరిష్కరించాలి.
- ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి. గిట్టుబాటు ధర కల్పించాలి. దళారుల మోసం నుండి ఆక్వా రైతులను రక్షించాలి. కోల్డ్ స్టోరేజ్‌లను వెంటనే నిర్మించాలి. విద్యుత్తు సబ్సిడీ అందరికీ వచ్చేటట్లుగా చర్యలు తీసుకోవాలి.
- ఫీడు ధరలు తగ్గించాలి. నాణ్యమైన సీడ్ కోసం యాచరీస్ పై చర్యలు తీసుకోవాలని ఈ ఏడు తీర్మానాలు మహాసభ ఆమోదించిందని తెలిపారు.
