TG Budget | మరికొద్దిసేపట్లో అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్‌: భారీఅంచనాల నేపథ్యంలో నేడు (బుధవారం) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. బుధవారం ఉదయం 11.14 గంటలకు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

అంతకంటే ముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్ కావడం గమనార్హం.2024-25లో 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈసారి రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.

నేటి ఉదయం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.

గ్యారంటీలకు తోడుగా!

తాజా బడ్జెట్‌లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్‌ పెంచుతారని సమాచారం.

ఇక సమీకృత రెసిడెన్షియల్‌ పాఠశాలలకు రూ.5వేల కోట్లు, రాజీవ్‌ యువ వికాసం కోసం రూ.6వేల కోట్లు, రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం పథకానికి రూ.5వేల కోట్ల వరకు కొత్తగా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.

.ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద జనాభా ప్రాతిపదికన మొత్తం బడ్జెట్‌లో 18శాతం మేర ప్రతిపాదిస్తారని సమాచారం. రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.

గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రుణాలు, కేంద్ర నిధులపై ఆశలు!

బడ్జెట్‌ రాబడుల్లో భాగంగా రుణ సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌ చేయనుంది. రూ.17 లక్షల కోట్ల వరకు జీఎస్‌డీపీ నమోదవుతుందనే అంచనాలు, తీరుతున్న గత అప్పుల ప్రాతిపదికన రూ.65 వేల కోట్ల వరకు కొత్తగా రుణాలు ప్రతిపాదించే అవకాశముంది. కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29వేల కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.20వేల కోట్ల వరకు వస్తాయని ప్రభుత్వం చూపెట్టనుంది.

సొంత పన్ను రాబడుల పద్దును రూ.1.50లక్షల కోట్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.38లక్షల కోట్ల వరకు పన్ను రాబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకోగా.. జనవరి నాటికి రూ.1.12 లక్షల కోట్ల వరకు వచ్చాయి. చివరి రెండు నెలల్లో మరో రూ.25 వేల కోట్ల వరకు సమకూరే చాన్స్‌ ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ పన్ను రాబడులు పెరుగుతాయనే అంచనాలతో.. ఈ పద్దును రూ.1.50 లక్షల కోట్లుగా చూపెట్టవచ్చని అంచనా.పన్ను రాబడులకు సంబంధించి.. స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ శాఖలకు ఈసారి భారీ టార్గెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ ఆదాయం మరో రూ.5 వేల కోట్లు అదనంగా వస్తుందని.. భూముల విలువల సవరణ వంటి కార్యక్రమాల ద్వారా రిజి్రస్టేషన్ల శాఖ పద్దు రూ.20 వేల కోట్లు దాటవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. భూముల అమ్మకాల ద్వారా పన్నేతర ఆదాయాన్ని కూడా భారీగా చూపెట్టవచ్చని సమాచారం.

రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014-15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్‌ పెట్టగా.. 2024-25లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2014-15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్‌ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.2019-20లో కరోనా ప్రభావంతో బడ్జెట్‌ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్‌ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్‌ 2024-25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ (2024-25) బడ్జెట్‌లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *