ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..
నేటి యువత బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి
అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అమర వీరులకు ప్రేరణగా నిలిచిన దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. రాజకీయ, సామాజిక నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అచ్చంపేట డివిజన్ అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ సేవలో అగ్రగామిగా నిలిచారని కొనియాడారు. సైన్యంలోనూ, సామాజిక రంగంలోనూ దళితుల పాత్ర అపారమని ఆయన ఎప్పుడూ ప్రస్తావించారని గుర్తుచేశారు. “దేశ రక్షణలో దళితుల సేవలను దేశం ఎప్పటికీ మరిచిపోదు” అని ఆయన చెప్పిన మాటలను స్మరించారు.
ప్రధానిగా అయ్యే అవకాశమున్నప్పటికీ కుల వివక్ష కారణంగా పూర్తి మద్దతు లభించలేదని, అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా ప్రజాసేవలో ముందుండి పోరాడారని పేర్కొన్నారు. దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేసిన మహానేతగా ఆయనను అభివర్ణించారు. తన రాజకీయ ప్రస్థానానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని మార్గదర్శిగా భావించిన బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ మరణానంతరం పార్లమెంట్‌లో దళితుల తరఫున బలంగా గళం వినిపించారని ఆయన తెలిపారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు బిసమల్ల ఆనంద్, కొంకి విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సౌట కాసిం మాదిగ పాల్గొన్నారు.
