వసంత నవరాత్రులకు విస్తృత ఏర్పాట్లు..

వసంత నవరాత్రులకు విస్తృత ఏర్పాట్లు..
వైభవంగా మార్చి 19 నుంచి ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 19 నుంచి 28 వరకు జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రులు, ఉగాది వేడుకలు, పుష్పార్చనలు, శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గురువారం దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో కలిసి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లు, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా వంటి అన్ని అంశాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఉగాది సందర్భంగా ఆలయంలో నిర్వహించే పంచాంగ శ్రవణం కార్యక్రమంతో పాటు సాయంత్రం వెండి రథోత్సవాన్ని భక్తులకు ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పుష్పార్చన వంటి ఆర్జిత సేవల కోసం భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ఆదేశించారు.

అదేవిధంగా వసంత నవరాత్రుల అనంతరం మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించే చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను కూడా వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈవో సూచించారు. ప్రతిరోజూ జరిగే వాహన సేవలు, చివరి రోజు నిర్వహించే నదీ విహార కార్యక్రమం ఈ ఏడాది వినూత్నంగా ఉండేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజినీరింగ్, ఫెస్టివల్ విభాగాల అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, వి. శ్రీధర్ శర్మ, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, ఏఈఓలు బివి రెడ్డి, పి. చంద్రశేఖర్, కె. గంగాధర్, ఈఈ ఎల్. రమ తదితరులు పాల్గొన్నారు.
