హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇక 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గ్రూప్-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఒక శాతం రిజర్వేషన్, మాదిగలున్న గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్లు, మాలలు ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
ముందుగా ఈ బిల్లును శాసనసభలో మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు.. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం సంపూర్ణ మద్దతు పలికాయి. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ.. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఈ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని,వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాదిగల రిజర్వేషన్ కోసం గత ముప్పై ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ పోరాటంలో చాలా మంది అమరులు అయ్యారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలను, మాదిగ ఉపకులాల వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అమరులైన వారి కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అంతేగాక త్వరలో అమలు చేయబోయే రాజీవ్ యువ వికాసం పథకంలో కూడా అమరులైన వారి కుటుంబంలో చదువుకున్న వారు ఉంటే వారికి ప్రాధాన్యత ఇచ్చి, ఈ ఫథకం కింద నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీ వేదికగా సీఎం భరోసా ఇచ్చారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మనం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు అప్పట్లో సుప్రీం నోటీసులు ఇచ్చింది.. దాంతో మనం సీనియర్ అడ్వకేట్ నీ పెట్టాం. వర్గీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పాం.. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వెంటనే మేము స్పందించాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం వేసి ప్రక్రియ మొదలు పెట్టాం.. సబ్ కమిటీ సూచన మేరకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. పారదర్శకంగా ఎవరికి అన్యాయం జరగకూడదు.. అనుమానం ఉండొద్దని కమిషన్ సూచన చేసిందని రేవంత్ పేర్కొన్నారు.
ఇక, ఎస్సీలో 59 ఉప కులాలు ఉన్నాయి.. ఆ కులాలను మూడు గ్రూపులుగా విభజించామని సీఎం తెలిపారు. మొదటి గ్రూప్ లో 15 ఉప కులాలున్నాయి.. వారికి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చాం.. రెండో గ్రూప్ లో 18 ఉపకులాలు ఉంటే వారికి 9 శాతం రిజర్వేషన్ ఇచ్చాం.. మూడో గ్రూప్ లో 26 ఉపకులాలు ఉంటే.. వారికి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే, వివేక్ వెంకటస్వామి సూచన మేరకు జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతాం.. 2026 జనాభా లెక్కలు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం.. గ్రూపుల వారీగా పంచుతామని వెల్లడించారు. రిజర్వేషన్లు పెంచాలంటే సహేతుకమైన విధానం ఉండాలని అన్నారు.