TDP | ముద్రగడకు బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ

TDP | ముద్రగడకు బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ

  • కులం పేరుతో ద్వంద్వ వైఖరి తగదు
  • చంద్రబాబుపై ద్వేషానికి కారణం చెప్పాలి
  • మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

TDP | ఆంధ్రప్రభ, విజయవాడ : ముద్రగడ పద్మనాభ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు ముద్రగడ రాసిన లేఖపై స్పందించిన వెంకన్న, కుల అంశాన్ని అవసరమైనప్పుడే ప్రస్తావించే ద్వంద్వ వైఖరి తగదని తీవ్రంగా విమర్శించారు. ముద్రగడ తన లేఖలో తండ్రి మాటలను ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంటూ మీ తండ్రి అవసరమైనప్పుడే కులం గురించి మాట్లాడమని చెప్పారా? అని వెంకన్న ప్రశ్నించారు.

మీ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తల్లి, భార్యపై అసభ్య వ్యాఖ్యలు చేసినప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అలాగే మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టి హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తీసుకెళ్లినప్పుడు ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారేనని గుర్తు చేశారు. ఒకప్పుడు కిర్లంపూడిలో మీకు అండగా ఉన్నది గవర సామాజిక వర్గమేనని చెప్పిన ముద్రగడ, అదే సామాజిక వర్గానికి చెందిన తనపై మాచర్లలో జరిగిన దాడి సమయంలో ఎందుకు స్పందించలేదని వెంకన్న ప్రశ్నించారు.

1994లో ముద్రగడ ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తర్వాత, 1999లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్‌కు పంపిన విషయం గుర్తు చేస్తూ, అప్పట్లో చంద్రబాబును గొప్ప నాయకుడిగా కొనియాడిన మాటలు నిజం కాదా అని వెంకన్న నిలదీశారు. అదే చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీ లోపల, బయట అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆ రోజు జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చంద్రబాబుపై చేసిన బూతులను మీరు సమర్థిస్తున్నారా? అలాగే ఆనాడు జోగి రమేష్ చేసిన దాడిని సమర్థిస్తున్నారా? అని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

ముద్రగడకు చంద్రబాబుపై అసలు ద్వేషం ఎందుకు ఉందో ప్రజలకు చెప్పాలని వెంకన్న కోరారు. మీలాంటి వారు ఎంత అసూయ పడితే చంద్రబాబు అంత బలపడతారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో నాయకుడు కాదని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అరుదైన నాయకుడని పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు అందరికీ తెలుసని, అందుకే ప్రజలు తిరిగి ఆయననే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని వెంకన్న స్పష్టం చేశారు. ఇకనైనా లేఖల్లో అసూయతో కాకుండా వాస్తవాలతో మాట్లాడాలని ముద్రగడకు హితవు పలికారు.

Leave a Reply