Supreme Court | వారం రోజుల డెడ్‌లైన్…

Supreme Court | వారం రోజుల డెడ్‌లైన్…
- ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేనా..
- స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
- విచారణ మరో నాలుగువారాల గడువు
- జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు కేసు
- అరికేపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాష్‌గౌడ్
- విడతల వారీగా ముగ్గురు అధికార కాంగ్రెస్‌లో చేరిక
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతో ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నేటికీ చర్యలు తీసుకోకపోవటాన్ని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) తప్పుపట్టింది. వారం రోజుల వ్యవధిలో వీరిపై చర్యలు తీసుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భారాస గుర్తుపై పోటి చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు విడతల వారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారాస కోర్టును ఆశ్రయించింది. ముందుగా హైకోర్టు (Court ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ కూడా చేపట్టారు.

కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని భారాస మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్పీకర్‌కు వారం రోజుల గడువు విధించింది. వారం రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చినందునా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి… వికారాబాద్ నియోజకవర్గం నుండి మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభ స్పీకర్ అయ్యారు.
2008లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి వికారాబాద్ నుండి విజయం సాధించారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికలో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో చేనేత, జౌళిశాఖ మంత్రిగా కూడా పని చేసారు. 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు ఓటమిపాలయ్యారు.
2023లో జరిగిన ఎన్నికలో ప్రసాద్‌కుమార్ మూడవసారి విజయం సాధించారు. రాష్ట్రంలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వికారాబాద్ నుండి విజయం సాధించిన ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్ పదవి విరించింది. వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.
కొడంగల్ నుండి విజయం సాధించిన ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగా వికారాబాద్ నుండి గెలిచిన ప్రసాద్‌కుమార్ స్పీకర్ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తొలిసారి స్పీకర్ పదవి వరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌కు ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. సుప్రీంకోర్టు డెడ్‌లైన్ పెట్టినందునా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి…
పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు….
జిల్లాలో 2023 ఎన్నికల్లో భారాస గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు విడతల వారీగా పార్టీ మారారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అధికార పార్టీలో చేరారు. దీనిపై భారాస పోరుబాట పట్టింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు వారం రోజుల డెడ్‌లైన్ విధించింది.
అనర్హత వేటుపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవల్సిందేనని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా లేక వారే ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జుబ్లిహిల్స్ ఉప ఎన్నిక విజయంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామ చేయించి ఉప ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తం మీద పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వారం రోజుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది…



