sunday magazine 19 oct 2025 ఆదివారం సంచిక 19 అక్టోబర్ 2025

1. ఐశ్వర్య దీపావళి ముఖపత్ర కథనం

2.కబుర్లు- శీర్షిక

3.కృతజ్ఞత కథ

4.ఏడూళ్ళ సూరిగాడు…శీర్షిక

5.మనసు-మాట శీర్షిక

6.మెదడుకు మేత-సామెత శీర్షిక

7.హృదయస్పర్శ కథ

8.వినరో భాగ్యము శీర్షిక

9.సన్నిహితం.. .శీర్షిక.

ముఖపత్ర కథనం

1.ఐశ్వర్య దీపావళి …

దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్థన!
దీపో హరతుమే పాపం, దీపం జ్యోతి నమోస్తుతే.!!

ఆశ్వీయుజ శుక్ల త్రయోదశి మొదలు దీపావళి ఉత్సవం ప్రారంభం అవుతుంది. నరకాసుర వధానంతరం సత్యభామ సాధించిన విజయానికి లోకంలో చీకట్లు పోయి వెలుగులు ప్రారంభం కాబడ్డాయి. అఙ్ఞానాంధకారంలో మునిగిన ప్రపంచాన్ని వెలుగులతో నింపే సాంప్రదాయమే దీపావళి ఉత్సవం లేదా పండుగగా మనం జరుపుకుంటున్మాము. వళీ అనగా వరుస క్రమం, దీపావళి అనగా దీపముల వరుస. త్రయోదశి రోజున ఇంటి యజమాని దీర్ఘ ఆయుష్షుతో జీవించటానికి దక్షిణం వైపు ఆకాశం కనిపించే విధంగా మట్టి ప్రమిదలో ఆముదంతో మూడు వత్తులతో దీపం పెట్టాలి. యమధర్మరాజు అశీర్వాదంతో గృహయజమాని శతాయువు పొందుతాడు. దీపానికి క్రింద వరిపిండితో ముగ్గువేసి దీపం పెట్టి, ఆ నూనెలో ప్రకృతి ప్రసాదించిన ఒక చిన్న గవ్వ వేసి ఆ దీపం వెలుగులు ఆకాశం చూస్తున్నట్లు పెట్టాలి. ఈ త్రయోదశిని ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు. స్వర్ణం ఇంటికి వస్తే లక్ష్మీదేవి వస్తుందనే భావనతో ఎంతో కొంత బంగారం ఈ మధ్య కొనుగోలు చేస్తున్నారు. ఈ సంప్రదాయన్ని మీ అనుకూలంగా పాటించవచ్చును.

రెండవ రోజు చతుర్థశి నాడు ఇల్లు శుభ్రం చేసుకుని రంగవల్లులు తీర్చిదిద్ది పనికిరాని, వాడని సామాన్లను గృహం నుండి వేరుచేసి, పిల్లల తలకు నువ్వుల నూనె వ్రాసి, దీవించి, తదుపరి అభ్యంగన స్నానం చేయించి, నూతన వస్త్రములు ధరింప చేసి పిండివంటలతో భోజనం పెట్టాలి. సాయంత్రం ద్వారబంధానికి ఎదురుగా రెండు క్రొత్త మట్టి ప్రమిదలలో కుడి ఎడమలుగా దీపం పెట్టాలి. జీవితంలో వచ్చే ఆనంద ఆగమనానికి సంకేతంగా టపాసులు కాల్చి దీపావళి పండుగను ఆహ్వానించాలి.

అమావాస్య ఉదయమే సూర్యుడు ఉదయించకుండా గృహస్తులు నిద్రలేచి, అభ్యంగన స్నానం చేసి గ్రహరాజుకి నమస్కరించి మహాధనలక్ష్మిని కలశతోగాని, లేక సంప్రదాయాన్ని అనుసరించిగాని లక్ష్మీనారాయణ ప్రతిమతో కుబేర ముగ్గులో స్థాపించి పూజాదికాదికాలు చేసి శక్తికి తగినట్లుగా నైవేద్యం సమర్పించాలి. కుబేర ముగ్గు క్రింద ఇవ్వటం జరిగింది. దీనిని పండితుల ద్వారా తెలుసుకున్నది.

27 20 25
22 24 26
23 28 21

ఓం యక్షేశాయ విద్మహే వైశ్రవణాయ ధీమహీ !
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్‌ !! అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. అనంతరం మహాలక్ష్మిని సహస్రంతో గాని, అష్టోత్తరంతో గాని పూజించాలి. కుబేర ముగ్గుకు ఎదురుగా ఆవునేతి దీపం శ్రేష్టం. పై విధంగా వేసిన ముగ్గుపై ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఒక్కొక్క అంకెపై అమర్చి, దానిపై విధిగా ఎర్రి పుష్పములు పెట్టవలెను. ఈ ముగ్గుపై గాని ప్రక్కన గాని లక్ష్మీనారాయణులను అమర్చి పూజించ వచ్చును. ఈ విధంగా పూజించి నట్లయితే ఐశ్వర్యం మన చెంతే నివాసం ఉండటానికి అవకాశం ఎక్కువగా వుంటుంది. విప్పనూనె లక్ష్మీ పూజకు ప్రత్యేకంగా వాడటం మంచిది. విప్పనూనె మహాలక్ష్మిని మనకు అత్యంత సన్నిహితం చేసే కారకం. ముందుగా పసుపు వినాయకుడిని తమలపాకులో స్థాపించి పూజించటం మరువకూడదు.

శ్రీ మహావిష్ణువు వామనావతారమెత్తి బలి చక్రవర్తిని పాతాళానికి పంపించాడు. అయినప్పటికి బలి శ్రీహరినే సదా ధ్యానించినందుకు విష్ణువు సంతోషించి బలి చక్రవర్తికి ఒక గొప్పవరం ప్రసాదించాడు. ఆ వరం కారణంగా ప్రతి సంపత్సరం దీపావళి రోజున బలి చక్రవర్తి పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ఆ ఒక్క రోజు పరిపాలిస్తాడు. కనుక ప్రజలు సంతోషంతో ఇంటినిండా దీపాలు వెలిగిస్తే బలి చక్రవర్తిని, మహావిష్ణు సమేత శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించినట్లువుతుంది. ఆ విధంగా ధనలక్ష్మి ఐశ్వర్య ప్రదాతగా అనుగ్రహించి మనలను అశీర్వదిస్తుంది. దీనిని కౌముదీ వుత్సవంగా కూడా వ్యవహరిస్తారు.

సంధ్యా సమయంలో గృహంలో ప్రతి దిక్కుని చూసేలాగ ఇల్లంతా నువ్వులనూనె దీపం పెట్టాలి. ధనలక్ష్మికి అదే ఆహ్వనం. ముందుగా తులసికోట వద్ద కార్తీకదామోదరాయనమ: అని దీపం పెట్టి అందరికీ అందుబాటులో వుండే ఉసిరిక దీపంపెట్టాలి. ఇది లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైనది. గోగు కర్రలకు క్రొత్త బట్ట కట్టి నూనెలో ముంచి దివిటీలుగా తయారుచేసి చిన్నారులతో కొట్టించాలి. అనంతరం వాళ్ళ పాదాలు శుభ్రంచేసి వారితో గుగ్గిలం లేదా సాంబ్రాణి వేరుంచి ఇంటిలోపలికి తీసుకుని పచ్చి మిఠారులు తినిపించాలి. ఇది కూడా మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన పని. ఆ చిన్నారులు తీపి తింటున్నప్పుడు వారి మనసుపడే ఆనందమే ధనలక్ష్మి ఆశీర్వాదం.

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం!
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం !!

అనంతరం గృహిణి నూతన వస్త్రములు ధరించి పూజాస్థానంలో ఉదయమే స్ధాపించిన లక్ష్మీనారాయణులను పూజించటం ప్రారంభించాలి. ఈ పూజ సాయంత్రం 6.30 గం. లోగా ప్రారంభించాలి. పూజలో కరివేరు లేక గన్నేరు, తామర, సన్నజాజి, విరజాజి, చామంతులు, గులాబీలు, నీలిరంగు పుష్పాలు వాడవచ్చును. కనకాంబరం, బంతి పూలను వూజలో వాడరాదు. అలంకరణలో వాడుకోవచ్చును. పూజను మంత్రపూర్వకంగా గాని, శ్లోక పూర్వకంగా గాని చేసుకోవచ్చును. పూజ పూర్తి అయిన తరువాత యధాశక్తి పలు రకాల నైవేద్యాలు సమర్పించాలి. చక్కటి కర్పూర హారతిని సమర్పించి, అ కర్పూర హారతి ఇల్లంతా తిప్పాలి. ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో ఇంటిలోని వారంతా స్వీకరించి ధనలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలతో టపాసులు కాల్పించి ఇల్లంతా వెలుగులతో నింపాలి. కొన్ని ప్రాంతాలలో అర్థ్రరాత్రి సమయంలో మహాలక్ష్మికి పరమాన్నం నైవేద్యం సమర్పించే సాంప్రదాయం కూడా వుంది. ఇంటిలో అందరిలో ఆనందోత్సాహాలను నింపే పండుగ కాబట్టి, ఉత్సాహంగా కలసి మెలసి చేసుకోవాలి.

టపాసులు కాల్చే క్రమంలో ప్రకృతిని ధ్వని కాలుష్యం, పొగ కాలుష్యం నుంచి కాపాడుకోవడం అందరి బాధ్యతగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంటిలోని లేదా మన చుట్టు ప్రక్కల ఉండే ముసలివారి లేదా రోగుల పరిస్థితిని కూడా గమనించుకోవాలి. మనం జరుపుకునే పండుగ ఇతరులకు నరకప్రాయం కారాదు. సర్వత్ర సమతౌల్యం పాటిస్తూ పండుగ జరుపుకుంటే సర్వభూత క్షేమాన్ని కాంక్షిస్తూ పండుగ జరుపుకుంటే తప్పక మన ఇంటిలో సర్వ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకుని, మరునాటి నుండే రాబోయే కార్తీక మాస ఉత్సవాలకు సిద్ధం కావాలి.

అమావాస్య నాటి దీపాల వెలుగులలో చీకటిని పోగొట్టి మనలో నిక్షిప్తమైన అఙ్ఞాన మనే నరకాసురుడిని తొలగించి యోగ దీపావళిగా చేసి, యోగ మిత్రుల దీపాలను వెలిగించి ఈ కలియుగంలో సత్యయుగాన్ని స్థాపిద్దాం.
సర్వేజనా: సుఖినోభవంతు.

-డాక్టర్ దేవులపల్లి పద్మజ


2.కబుర్లు- శీర్షిక

ముందుమాట
ఆంధ్రప్రభ ఆదివారం సాహితీపుట బాధ్యులకు ఎన్ని మాటల్లో కృతజ్ఞతలు తెలుపుకొన్నా తక్కువే! అంటే నా భావం వారికి ధన్యవాదాలు చెప్పుకోవటం అన్న మాట!

ఇక పోతే ‘నామాట’ కువద్దాం!
సందర్భాన్ని బట్టి మాటకు అర్థం ఉంటుంది. .
మాట వరసకి- అంటే ‘ఒక ఉదాహరణగా’ అన్న మాట .
నా మాట ఏం చేసారూ?- అంటే నేను అడిగినదాన్ని ఏం చేశారూ? అని అర్థం .
మా పిల్ల పెళ్లిసంబంధం మాట ఏంటీ?-అంటే మా పిల్ల పెళ్లిసంబంధాన్ని గురించి వివరం ఏంటీ? – అని అర్థం.
మాట మీద మాటొచ్చి చివరికి దెబ్బలాటకు దిగింది వ్యవహారం – అంటే ఎదుటి వాళ్ల మాటను ఖండించి తమ మాటే వినమని ఘర్షణకు దిగడం అనే అర్థంలో వాడబడినమాట!
వాడి మాటల కేంటిలే?- వాక్యంలోని ‘మాట’ విలువలేని ప్రసంగం అనే అర్థం ఇస్తుంది.


మాటా మాటా వచ్చి భార్యాభర్తల మధ్య మరి మాటల్లేకుండా పోయాయి!- ఇక్కడ ‘మాటా మాటా’కి అర్థం వాదన.
కొడుకు పోయాడన్న విషాదవార్త విని ఆ తండ్రికి మాట పడిపోయింది..అన్న వాక్యం లో కొడుకు చావు వార్త విని తండ్రి నిశ్చేష్టుడయ్యాడన్న అర్థం ఉంది.
ఏమాట కామాటే చెప్పాలి- అంటే మంచికి మంచీ, చెడుకి చెడూ చెప్పాలన్న అర్థంలో వాడేది.
‘మనిషికో మాటా.. గొడ్డుకో దెబ్బ’– అనే జాతీయంలోని మాటకు మందలింపు అని అర్థం.
‘నీకో మంచి మాట’ ప్రయోగాన్ని ‘ నీకు ఒక శుభవార్త ‘ అన్న భావంలో వాడేది
‘అనే మాటా.. అనకూడని మాటా’ తెలీని అవ్యక్తపు మనిషి – అంటే సందర్భానికి తగ్గట్లు మాట్లాడటం రాని మనిషి అని అర్థం.
నలుగురిలో ఉన్నప్పుడు, ఒక మనిషిని మాత్రమే ఉద్దేశించి ‘ఇదిగో మాట’ అని పిలిస్తే నలుగురూ వినకుండా చెప్పాల్సిన మాటన్న మాట ఆ మాట.
‘అద్గదీమాట’- వాదం సాగే సందర్భంలో ‘సమయానికి తగిన మాట’ అనే అర్థంలో వినిపించే మాట.
‘ఎంతమాట! తమరలా పెలవియ్యవచ్చునా?’ అనడం గౌరవిస్తూనే అభ్యంతరం వెలిబుచ్చటం.
‘వేలంత లేడు. ఎంతలేసి మాటలన్నాడనుకున్నావ్!’ అంటే స్థాయిని మించి మాట్లాడాడని అర్థం.
‘మాటలు కోటలు దాటతాయి. కాలు గడపదాటదు’ అంటే కోతలు కోయడం.
‘మనలో మన మాట’ నలుగురితోనూ అనవలసిన విషయం కాదు అని అర్థం.
‘నీ మనస్సులోమాట యేదో చెప్పరాదూ!’ అన్నప్పుడు, గుట్టుగా దాచుకున్న బైటికి చెప్పెయ్యమని చెప్పడం.
‘మాటంటే మాటే’ అంటే చేసిన వాగ్దానం వెనక్కు తీసుకోను’ అని హామీ ఇవ్వడం .
‘అదేఁవన్నమాట?’ అని సవాలు చేస్తే, ఎందుక్కాకూడదూ? అని అర్ధం.
‘ఘంటయి వాగుతూ ఉంటే, ‘ఏమాటా’అనవేంరా! అని ఘోషిస్తే, ‘జవాబు’ చెప్పవేంటని గద్దించడం.
‘వాడి మాట ఇహ మరిచి పో! వాడు ఇక రాడు’ అనే మాట నిస్పృహలో నుంచీ వచ్చే మాట.

అసలు ఉన్న మాట ఏంటంటే అన్ని మాటలూ బైటకు చెప్పలేం! లోపలా దాచుకోలేం! అదన్న మాట ఆఖరు మాట!


3.కృతజ్ఞత (కథ)

ఆ బడికి కొత్తగా వచ్చిన మాష్టారు సుబ్బారాయుడు. బడిలో టీచర్లంతా పెద్దసారు అంటూ గౌరవిస్తారు . ఆయన రోజూ అన్నం తినేముందు ఒక ముద్ద తీసి ఆకులోనో ,కాగితంలోనో ఉంచేవాడు. వెళ్ళి ఆటస్థలంలో ప్రహరీగోడకు దగ్గరగా ఒకచోట పెట్టడం అలవాటు. ఆ తరువాతే తన భోజనం. టీచర్లకు కొన్ని రోజులు వింతగా అనిపించినా ‘ఏమిటి?’ అని ఎవ్వరికీ అడగాలనిపించలేదు. తరువాత పట్టించుకోవడం మానేశారు. మాష్టారు పెట్టిన అన్నం ముద్ద కోసం కాకులు వచ్చేవి.

అలవాటైన కాకులు కొన్నాళ్ళకు సరిగ్గా భోజన సమయానికి అక్కడ వాలేవి. క్రమక్రమంగా మాష్టారు అన్నం పెట్టే సమయానికి రావడం ప్రారంభం ఆయింది. ఆపై కొన్నాళ్ళకు అవి ఆయన వెంట నడుచుకుంటూ వెళ్ళేవి. దగ్గరగా ఉండేవి. ఆయన ఆ అన్నాన్ని అక్కడ పెట్టి చిరునవ్వుతో వెనుదిరిగి చూస్తూ వెళ్ళేవాడు. తృప్తిగా భోజనం చేసేవాడు. ఇదంతా ఆ బడిలోని 3వ తరగతి రాకేష్‌ నెలరోజులు పైగా గమనిస్తున్నాడు.

‘ఉత్త చేయిని విసిరితేనే కాకులు ఎగ్గిరిపోతయిగా. మరి, సారు దగ్గరేమో? ఎగరిపోవడం లేదేంటి?’ అని, ప్రతిరోజూ ఆశ్చర్యపోసాగాడు. ఆలోచన పెరిగిపోతున్నది. ఇది వరకు బడిలో అన్నం తిన్నాక తోటి పిల్లలతో ఆడుకునేవాడు. ఇప్పుడు ఆటలు మానేసి, ఓ ప్రక్కగా కూర్చుని ఆ విషయమే ఆలోచించసాగాడు. ఒకరోజు, ‘ఆఁ! ఐడియా! నేను కూడా కాకులకు అన్నం పెడితే?!.. ఊఁహు, ఆయన సారు కాబట్టి ఎవ్వరూ ఏమీ అనరు. నేను పెడితే అందరూ చూసి నవ్వుతారేమో? ఎగతాళి చేస్తారేమో? అసలు మనం అలా పెట్టవచ్చో? లేదో?’ ఇలా రోజూ ఏవో సందేహాలు చిన్ని బుఱ్ఱలో నాట్యమాడేవి.

ఒకనాడు ఇలాగే ఆలోచిస్తూ, ‘ఆఁ, ఇంటి దగ్గర తింటే. అమ్మో! సారోళ్ళు బడిలో తినకపోతే ఒప్పుకోరు. ఇంట్లో తిందామంటే, అమ్మ, అయ్య పనికిబోతరు.’ అనుకుంటూ ఉండగా, బెల్‌ మ్రోగింది. ఆలోచనలు పటాపంచలయ్యాయి. క్లాస్‌లోకి అందరితోపాటు పరిగెత్తిపోయాడు. తరగతి పనులలో నిమగ్నమయ్యాడు. ఆ తరువాత విషయమే గుర్తులేదు. ఆ తరువాతి రోజు మధ్యాహ్నం భోజనం గంట కొట్టారు. రాకేష్‌ మదిలో వెంటనే ముందుటి రోజు ఆలోచనలు కొనసాగాయి. బడిలో అన్నం తినడం, మాష్టారు`కాకుల దృశ్యాన్ని దూరం నుంచి చూడడం నిత్యకృత్యమైంది.

‘‘ఒరేయ్‌! రాకేష్‌, రారా! ఖోఖో ఆడదాం’’ తన క్లాస్‌మేట్‌ పిలిచాడు . ‘‘ఆఁహ! నేను రాను పోరా’’ అంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు. పిలిచినవాడు,‘‘వాడు రాడంటరోయ్‌..’’ అనుకుంటూ వెళ్ళిపోయాడు. రాకేష్‌ ఆలోచనలు, నిర్లిప్తతలు నిత్యకృత్యమైపోయాయి.

మరో నెల రోజుల తర్వాత ఒకరోజు ఇలాగే నిరుత్సాహంగా కూర్చున్నాడు. ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడు.‘ఆఁ! ఐడియా. నాకు బడిలో అన్నం తినబుద్ధి కావడంలేదు. పొట్టనొప్పి వస్తుందని అమ్మతో చెబితే’ అనుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే అమ్మతో చెప్పాడు. అమ్మ బడిలో సారుతో చెప్పింది. ఇంట్లో వండిపెట్టి పనికి పోతానంది. అనుకున్నట్లే జరగడంతో రాకేష్‌ ఆనందానికి అవధుల్లేవు.
తరువాతి రోజు తన ఇంట్లో ప్లేట్లో అన్నం పెట్టుకున్నాడు.

ఇంటి ముందు ఉన్న కానుక చెట్టు ఆకు తీసుకున్నాడు. అన్నం ముద్ద పెట్టి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్ళాడు. కాకుల కోసం పైకి చూశాడు. ఎక్కడా ఒక్క కాకి కూడా కనబడడం లేదు. ఆకు అక్కడ పెట్టి కాస్త దూరంగా నిల్చున్నాడు. కాసేపు చూసి నిరాశతోనే అన్నం తిని బడికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి చూస్తే అన్నం ఎండిపోయింది. తరువాతి రోజు కూడా అంతే. రోజూ ఇలా పెడుతూనే తింటున్నాడు. కొన్నాళ్ళు గడిచింది.

ఓరోజు యథావిధిగా రాకేష్‌ ఆకులో అన్నం పెట్టి వచ్చి తింటున్నాడు. ఇంతలో, ‘కావ్‌, కావ్‌’మనే శబ్దం వినపడిరది. గబుక్కున పరిగెత్తుకెళ్ళి చూశాడు. అక్కడో కాకి తను పెట్టిన అన్నం దగ్గరలో ఉంది. కానీ, అటూ, ఇటూ దిక్కులు చూస్తోంది. రాకేష్‌ ను చూసి చటుక్కున ఎగిరిపోయింది. రాకేష్‌ బాధ పడ్డాడు. తనను చూసి భయపడిందని అర్థమయింది. పక్కగా దాక్కున్నాడు. కొద్ది సేపటికి మరలా వచ్చిందా కాకి. అది అన్నం తింటుంటే తన మనసు ఎక్కడికో ఎగిరిపోతోంది. ఏదో చెప్పలేని హాయితో ముఖంలో వెలుగు, పెదవులపై చిరునవ్వు. ‘‘హే…య్‌’’ అంటూ ఎగ్గిరి గంతేసి అటు చూశాడు. అక్కడ కాకి లేదు. ఆనందం ఆవిరయ్యింది. ముఖంలో బాధ వెలిసింది.

తరువాతి రోజు నుండి అన్నం ఆకును అక్కడ పెట్టి వచ్చి చాటుగా చూడసాగాడు. అలాగే రోజూ సంతోషపడిపోతున్నాడు . కొన్నాళ్ళ తరువాత అన్నం ఆకు అక్కడ పెడదామని వెళుతున్నాడు. ఎదురుగా గోడపై కాకి. ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. ఒక్క క్షణం ఆగాడు. మరలా ఎగిరిపోతుందేమో? అని ఆలోచించాడు. నెమ్మదిగా ఒక్క అడుగు ముందుకేశాడు. కాకి కాస్త పక్కకు జంప్‌ చేసింది. కానీ, ఎగిరిపోలేదు. ‘ఎగిరిపోతుందేమో’ నని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి నెమ్మదిగా కాకి వైపు చూడకుండా అక్కడ పెట్టాడు.

వెనుదిరిగాడు. దూరంగా వచ్చి చూశాడు. అక్కడ కాకి అన్నం తింటూ ఉంది. రాకేష్‌ కళ్ళలో ఆనందం, పెదవులపై చిరునవ్వు. ముఖంలో వెలుగు. తనకు తెలియకుండా ఆనందాన్ని పంచుకోవడానికి చుట్టూ చూశాడు. మరలా కాకి వైపు చూస్తూ సంతృప్తి పడ్డాడు. మరి కొన్ని రోజులకు బడిలో మాష్టారు అనుభవమే తనకు కూడా నిత్యకృత్యమయింది. ఓరోజు వాళ్ళమ్మ ,‘‘ఇప్పుడు బాగానే ఉంటుంది కదరా?! రేపటినుండి అన్నం బడిలోనే తింటావా? అక్కడ గుడ్డు, సాంబార్‌, పాయసం లాంటివి పెడతారు కదా. ఇంట్లో ఎక్కువగా పచ్చడి మెతుకులేనాయే!’’ అంది. రాకేష్‌ మౌనంగా ఉండిపోయాడు. మనసులో ఏమనుకుందో గానీ, తనను ఏమీ అనలేదు. పనికి వెళ్ళిపోయింది.

ఆరోజు బడికి సెలవు ఇచ్చారు. అమ్మా,నాన్నా పొలం పనులకు వెళ్ళారు. రాకేష్‌కు ఇంటి వద్ద ఒక్కడే ఉన్నాడు. బారెడు పొద్దు ఎక్కింది. అంబళ్ల పొద్దు దాటింది. ఏమీ తోచడం లేదు. ఊరి బయట అమ్మ పనిచేసే తమ పొలం వద్దకు బయలు దేరాడు. ఊరి పొలిమేర దాటాడు. చుట్టూ ఎవరూ కనబడడం లేదు. కాస్త భయంగా అనిపించి వెనక్కు వెళదామని అనుకున్నాడు. కానీ, మరలా బిక్కుబిక్కుమంటూ ముందుకే నడిచి వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చాడు.

రాకేష్‌ నోరును చటుక్కున మూసేసి చంకలోకి ఎత్తుకున్నాడు. వాడికి తోడు మరో ముసుగువాడున్నాడు. ఇద్దరూ కలిసి రాకేష్‌ను గబగబా ఎత్తుకుని పారిపోసాగారు. రాకేష్‌ కాళ్ళుచేతులు గిలగిలా కొట్టుకుంటున్నాడు. దుండగులు కొద్ది దూరం వెళ్ళగానే, రోడ్డు పక్క చెట్టుపై ఉన్న ఒక కాకి చూసింది. ‘కావు కావు’ మని అరిచి గాల్లోకి ఎగిరింది. దుండగుల వెంట పైన ఎగురుతూ ‘‘కావ్‌ కావ్‌’’మంటోంది. వాళ్లు మరో ఇరవై అడుగులు ముందుకు వేశాడు. కాకి అరుస్తూనే ఉంది.

ఇంతలో మరోకాకి వచ్చి ఆ కాకిని అనుసరించింది. ఇలా, వెంటవెంటనే కాకుల సంఖ్య పెరిగి గుంపులా తయారయ్యింది. ఇప్పుడు ఆ కాకులన్నీ ‘కావ్‌ కావ్‌’ మంటూ ఆ ముసుగువాళ్ళను పొడవసాగాయి. ఆ ధాటికి తట్టుకోలేక రాకేష్‌ను అక్కడే వదిలి పారిపోయారు. కొంత దూరం వరకు తరిమివేశాయి. అటునుండి అటే కాకులు పక్కకు వెళ్ళిపోసాగాయి. పరిగెత్తుతున్న దుండగులను చూస్తూ రాకేష్‌ ఆనందంతో చప్పట్టు కొట్టుకుంటూ గెంతులు వేయసాగాడు. కొద్ది క్షణాల్లో వాతావరణం మామూలుగా మారింది. రాకేష్‌లో ఇప్పుడు ఏదో తెలియని ధైర్యం నిండింది. ఎగురుకుంటూ పొలం వైపు అడుగులేశాడు.


4.ఏడూళ్ళ సూరిగాడు…శీర్షిక

ఈ బతుకొద్దురో..

“ వావ్.. పచ్చని వరి చేలు. గట్టు పై వరుసగా తాటి చెట్ల వడ్డాణం. కాదు పచ్చల హారం . ఈ తెలుగునేలలో ఈ తాళ్ల తరువే .. ఒకప్పటి అసురుల ఈ కల్పవృక్షం పచ్చటి సిగలో పగడాల సూరీడు ధగధగల దరహాసం. ఈ వెలుగుల జిలుగుల్లో ,, తాటి రేకులో గవుండ్ల వెంకన్న పోసిన తియ్యటి కల్లు గటగటా గుటకేస్తుంటే .. అబ్బా ఆ రుచే వేరబ్బా.. అహో సురా పానమా? అని మహాకవి గుర్రం జాషువా పద్య పదవిన్యాల హరిశ్చంద్ర నాటకం గుర్తుకు రావాల్సిందే” తనలో తాను నవ్వుకుంటూ దెందులూరు రైల్వే స్టేషన్ లో ఏడూళ్ల సూరిగాడు అడుగుపెట్టాడు. “ “బెజవాడ ఒక టిక్కెట్టు” అని టిక్కెట్టు కౌంటర్ లో వంద నోటు ఇచ్చాడు. “ త్వరగా వెళ్లు రైలు వచ్చేస్తోంది” అంటూ కౌంటర్ లోని వ్యక్తి టిక్కెట్టు చేతిలో పెట్టాడు. హడావిడిగా ఏడూళ్ల సూరిగాడు ఫ్లాట్ మీదకు వచ్చాడు. ఇంతలో రెండు కుక్కలొచ్చి తోకలు ఊపుతూ ఏడూళ్ల సూరిగాడిని పలకరించాయి. ఏమే నేను మీకు తెలుసా? నవ్వాడు సూరిగాడు. కుక్కలు తోకూపుతూనే ఉన్నాయి. ఇన్నేళ్లు గడిచినా ఈ స్టేషన్ మారలేదు. నాలాంటోడు తప్ప ఈ స్టేషన్ లో రైలు ఎక్కటానికి జనం రారు. ఎందుకు వస్తారు? ఊరిని వెలేసినట్టు జనంలేని చోట కడితే ఎవ్వడొస్తాడు? అని సూరిగాడు చిరాకు పడ్డాడు.
“ ఔను.. ఈ స్టేషన్ ను నక్సలైట్లు పేల్చారు కదా, ఎప్పుడబ్బా? ”గుర్తు చేసుకొంటూ.. ఏమో గుర్తుకు రావట్లే. పెదవేగిలో జీడిపిక్కల పోరాటం.. బాగా గుర్తుంది మొండూరు, దెందులూరుల్లో నక్సలైట్లు తిరిగారు, కామవరపు కోట కాళ్ల చెరువులోనూ జనాన్ని పోగేశారు. ఎప్పుడబ్బా.. ఏం గుర్తుంటుందీ.. నలబై ఏళ్లు దాటిపోయింది” , అని మదన పడుడుతుండగా.. “ ఒకటి ఏడు రెండు ఐదు సున్నా కాకినాడ తిరుపతి ప్యాసింజర్ నెంబర్ ఒకటవ నెంబర ప్లాట్ పారం పై వస్తోంది, అని ఎనౌన్స్ మెంట్ వినగానే సూరిగాడు తేరుకున్నాడు. ఇంతలో రైలు ఆగింది. బోగిలోకి ఎక్కాడు. జనం కిక్కిరిపోయారు. ఒక్కొక్కళ్లను తప్పించుకుంటూ సూరిగాడు లోనికి వెళ్లాడు.

జనం ఎవ్వరినీ ఎవ్కరూ పట్టించుకోవటం లేదు. చేతిలో సెల్ ఫోన్ చూస్తున్నారు. పాటలు వింటున్నారు. య్యూటూబ్ జోకులకు పగలబడి నవ్వుతున్నారు. ఇంకొందరు షిట్.. షేర్లు పడిపోయాయి అనగానే.. బంగారం రేటు కూడా పడిందా? అని అతడి పక్కన ఓ ఇల్లాలు అడిగింది. ఆమె వైపు ఆ మొగుడు సీరియస్గా చూశాడు. చాయ్ .. చాయ్ కాఫీ కాఫీ అంటూ ఓ కుర్రోడు తోసుకుంటూ ముందుకెళ్లాడు. అంతలోనే “ వాటర్ .. వాటర్ .. డ్రింక్స్ డ్రింక్స్” అరుపు వినిపించింది. “ సమోసా.. సమోసా” ఇంకొకడు అరిచాడు. కాసేపటికి “ పల్లీ పల్లీ” అంటూ ఓ అమ్మి కీచుగొంతుతో “జరుగు అన్నా” అంది. సూరిగాడు తప్పుకున్నాడు.


“ ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా.. ఎన్నెన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా పాటలు పాడే గుడ్డోడ్డు రాలేదు, వేరు బాదం పప్పు వేరు బాదం పప్పు.. బెల్లం చెక్కలమ్మే ముసలోడు రాలేదు. చచ్చిపోయారేమో”? అనుకున్నాడు సూరిగాడు. “అంకుల్ .. అంకుల్” అని ఓ కాలేజీ పిల్ల పిలిచింది.
“ నేను బాబాయ్.. నిడదవోలు కోటయ్యను, ఇక్కడికి రా.. అని వంటి నిండ బంగారంతో ఓ వ్యక్తి పిలిచాడు. సూరిగాడు అక్కడకు వెళ్లగానే
“ పక్కకు తప్పుకో.. రా కూర్చో బాబాయ్” అంటూ కాస్త చోటు ఇచ్చాడు ఆ బంగారు స్వామి. అతడెవరో సూరిగాడికి గుర్తు రావటం లేదు.“ నేను బాబాయ్ .. ఏలూరు పత్తేబాదలో వేదరాజు థియెటర్ దగ్గర టీకొట్టు చిన్నయ్య కొడుకుని, నవ్వు టీతాగి .. ఏరా చిన్నోడా బడికి పోయావా? అని అడిగేవాడికి గుర్తులేదా”? కోటయ్య అన్నాడు .
” అవును, గుర్తుకొచ్చింది, అమ్మానాన్న ఎలా ఉన్నారు?” సూరిగాడు అడిగాడు.
“అమ్మ అప్పుడే చచ్చిపోయింది. కరోనాలో నాన్న కూడా పోయాడు” బాధగా బదులిచ్చాడు.
“నువ్వేం చేస్తున్నావ్” , సూరిగాడు అడిగాడు.
నాన్న కష్టపడ్డాడు. కాల్దారిలో పదెకరాలు కొన్నాడు. రైసు మిల్లు పెట్టాం. బియ్యం వ్యాపారం చేస్తున్నా, ఘనంగా కోటయ్య చెబుతుంటే..
“ రేషన్ బియ్యం దొంగ ఎక్స్ పోర్టు కూడా చెప్పు”.. ఓ బుడ్డోడు అందుకున్నాడు. “ఎవడీ చిచ్చర పిడుగు ” అని ఆశ్చర్యంగా సూరిగాడు నవ్వుతూ అడిగాడు.
“ నా కొడుకే బాబాయ్ ఆఖరి నలుసు. గారభం ఎక్కువైంది”, సీరియస్ గా కోటయ్య తన కొడుకువైపు చూశాడు.
“ ఈమె నా భార్య బంగారు లక్ష్మీ”కోటయ్య పరిచయం మొదలు పెట్టాడు .. ఆమె నమస్కారం పెట్టింది. ఈమె నా పెద్ద కూతురు నవీన. సివిల్స్ ప్రిపేర్ అవుతోంది. కలెక్టర్ కావాలని కష్టపడి చదువుతోంది. ఆమె కూడా నమస్కారం పెట్టింది.
“ అవును కలెక్టరమ్మ అవుద్ది. సీఎంకి ఊడిగం చేసి ..కమీషన్లు కొట్టేద్ది. ఆ తరువాత కేసుల్లో ఇరుక్కుంటుంది” , అని చిచ్చరపిడుగు అందుకున్నాడు.
“ డాడీ” అని నవీన కోటయ్య వైపు చూడగా.. ఆ పిల్లోడు ఓ బిస్కెట్టు నోట్లో పెట్టుకుని కరకరలాడించాడు. సూరిగాడు నవ్వు ఆపుకోలేక పోయాడు.
“ వీడు రెండోవాడు. సందీప్. ఎంటెక్ కంప్యూటర్స్ చేశాడు. అమెరికా వెళ్టామనుకున్నాడు. అక్కడ ట్రంప్ గోలెక్కువైంది. అందుకే ఇక్కడే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఐపీఎస్ వీడి టార్గెట్ ” గర్వంగా చూశాడు కోటయ్య. సందీప్ సెల్ ఫోన్ లో ఏఐ యాప్ లో ఏవేవో ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఇంతలో
“ నిజమే, ఈయన ఐపీఎస్ కాగానే.. పొలిటీషియన్లకు సలాం చేస్తాడు. అధికారంలో ఎవరుంటే వాళ్లకు గులాంగిరి చేస్తాడు.

కాల్మొక్కుతా బాంచన్ అంటాడు. దొంగకేసులు పెడతాడు. సెలబ్రెటీలను అరెస్టు చేస్తాడు. ఈజీమనీతో విర్రవీగిపోతాడు. . అది కుదరక పోతే మర్యాదగా ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇర్కుకుంటాడు”, మరో బాంబు పేల్చాడు ఈ చిచ్చర పిడుగు. వీడ్ని చంపేస్తే బాగుండు అన్నంత కోపంగా సందీప్ చూశాడు.
“ అరే ఆగరా”.. అని కోటయ్య బుడ్డోడుని బతిమిలాడాడు. సూరిగాడు మళ్లీ నవ్వాడు.
“ సరే ఈ అమ్మాయి ఎవరు”? సూరిగాడు అడిగాడు. ఏమి చెబితే ఆ చిట్టిగాడి ఏం వాగుతాడోనని కోటయ్య మౌనం పాటించాడు.
“ సార్ నమస్తే.. నా పేరు నిఖిత. ఎంబీబీఎస్ నా టార్గెట్ , గొప్ప డాక్టర్ అవుతా” మధ్యలో అందుకుంది కోటయ్య కూతురు.
“ డాక్టర్ అవుతావా? ఏం చేస్తావ్. పిల్లల్ని పుట్టిస్తావా? హాస్పటల్ లో పిల్లల్ని ఎత్తుకుపోతావా? మార్చురీలో డెడ్ బాడీలు మాయం చేస్తావా? టెస్టులతో డబ్బులు గుంజేస్తావా? నీ టార్గెట్ ఎంత? ఎన్ని కోట్లు? ఇప్పుడే ప్లాన్ చేసుకో ” . చిచ్చర పిడుగు ప్రశ్నలే ప్రశ్నలు. నిఖిత కంగు తింది. తల్లి బంగారు లక్ష్మీ తన కొడుకు ప్రశ్నలకు ఉబ్చితబ్బిబ్బు అవుతోంది. కోటయ్య ముఖం పాలిపోయింది.
“ సరే చిన్నా.. ఇంతకీ నీవు ఏమవుతావ్” సూరిగాడు సూటిగా అడిగాడు.
“నక్సలైట్ ”సూరిగాడు బిత్తరపోయాడు. బుడ్డోడు కనీసం తలెత్తి చూడలేదు. పాకెట్లో లేస్ తీసి చప్పరిస్తున్నాడు.


నక్సలైటా? సూరిగాడు మళ్లీ అడుగాడి
“ ఔను, తాతయ్య నక్సలైటే”, బుడ్డోడు సీరియస్
ఎలా అవుతావ్ ? సూరిగాడి ప్రశ్న
డెడ్ ఈజీ . హైస్కూలు నుంచే విప్లవ విద్యార్థి సంఘం లో చేరుతా. బస్సులు తగలబెడతా. పోలీసులు అరెస్టు చేస్తారు. సెల్ లో కొడతారు. మా నాన్న పోలీసుల చుట్టూ తిరుగుతాడు. నన్ను వదలరు. పేపర్లో వార్తలు వస్తాయి. పౌరహక్కుల సంఘం వస్తుంది. నక్సలైట్లు పార్టీలో చేర్చుకుంటారు. దళ సభ్యుడిని అవుతా. డీసీఎం అవుతా. సెంట్రల్ కమిటీకి చేరుకుంటా. ఎవరొకరు నాయకుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటా. కుదరక పోతే ఖాళీగానే ఉంటా. హోంమంత్రి ములాఖత్ అవుతాడు. పెద్ద నాయకుల డేటా మొత్తం ఇచ్చేస్తా. ఇక ఎన్ కౌంటర్లే ఎన్ కౌంటర్లు. అందరూ లీడర్లందరూ తుడిచి పెట్టుకు పోతారు. ఇక నేను కూడా ఎర్రజెండా చించేస్తా. తెల్లకండువా వేసుకుంటా.. చేతిలో తుపాకీ ఇచ్చేస్తా. అని ఆ బుడ్డోడు అంటుంటే… సూరిగాడు తట్టుకోలేక పోయాడు.


“ అంత సులభం కాదు. చివరికి నీవు సాధించిందేంటీ ”? సూరిగాడి ముఖం ఎర్రబడింది.
“ ఇక్కడే.. నీకు అర్థం కాలేదు తాతయ్య .. ఊరికే చెట్టుకు కాయలు కాస్తాయా? రహస్యం తేరగా దొరుకుతుందా? అదే నా ఆయుధం. లొంగిపోతే కోట్లకు కోట్లు ఇస్తారు. పెద్ద కంపెనీల్లో అంబాసిడర్ పోస్టులు ఇస్తారు. పెద్ద పెద్ద బిల్డింగులు. కార్లు, విమానాల్లో టూర్లు.. ఇక కరో కరో జల్సా.. ఈ లెవల్ కు వెళ్లాలంటే..కోవర్టు ఆపరేషన్ జరగాల్సిందే, బుడ్డోడు ప్రవచించాడు.
‘‘ ఇంతకీ నీ పేరేంటి చిన్నా’’ సూరిగాడు అడిగాడు.


“ కోవర్డు బాబు .. ఇంకో మొగపిల్లాడి కోసం తిరుపతి వెంకన్నను మొక్కుకున్నా.. జాతకం చెప్పిన జ్యోతిష్కుడు.. ఈ పేరే పెట్టమన్నాడు”, మురిపెంగా ఆ బుడ్డోడిని తల్లి తన గుండెలకు హత్తుకుంది.
“ వామ్మో.. ఈ సమాజం ఎక్కడికి పోతోంది. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనే భావనే లేదు. అందర్ని చంపాలి. నేనే బతకాలి. ఇదేం బతుకురా నాయనా.. ఈ బతుకు నాకొద్దురో.. తండ్రీ ఈ చావు బతుకు నాకొద్దురో” .. అని సూరిగాడు లోలోన మదన పడుతుండగా.. రైలు బెజవాడ స్టేషన్ లో ఆగింది


5.మనసు-మాట శీర్షిక

ఆంధ్ర ప్రభ పాఠకులకు మా మనసు-మాట టీం తరపున నమస్సులు
ఇక నుంచి ప్రతి ఆదివారం ఒక క్లయింట్ మనసు-మాట తో మీ ముందుకు వస్తాము. మీ సందేహాలను కూడా మాకు పంపవచ్చు.
( క్లయింట్ మనసు-మాట లో కొన్ని వివరాలు గొప్యత కోసం మార్చబడ్డాయి)

సరిత మనసు-మాట: నేను ఒక 28 సంవత్సరాల మధ్య తరగతి యువతిని. టీచర్ గా పని చేసేదాన్ని. నాకు శేఖర్ తో వివాహం అయ్యి సంవత్సరం అయ్యింది. ఉద్యోగం చేసుకొని ఆర్థికంగా పెళ్ళికి ముందు స్థిరపడాలన్నది నా కోరిక. నా తల్లి తండ్రులకు ఎంత చెప్పిన వినకుండా నన్ను ఒప్పించి వివాహం జరిపించారు.
వివాహం అయిన వెంటనే నా భర్తతో నాకు అప్పుడే పిల్లలు వద్దని, ఒక సంవత్సరం సమయం కావాలని అడిగాను. నా అత్త -మామలు, పిల్లలు ఎప్పుడు అని తరుచు అడగడంతో నా భర్త పిల్లల్ని త్వరగా కనాలి అన్న వత్తిడి నా పైన పెట్టారు. పెళ్ళైన సంవత్సరానికే మాకు ఒక బిడ్డ పుట్టాడు.నేను గర్భవస్థను ఎప్పుడు ఆనందించలేదు. బిడ్డ పుట్టిన నెల రోజుల్లోనే నాకు
పిల్లాడికి ఏమి చేయాలనిపించేది కాదు. పిల్లాడి ముద్దు చేష్టలను చూసుకుని ఆనందించలేకపోవడం, ఎప్పుడూ దిగాలుగా ఉండడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ఎప్పుడు పరధ్యాన్నం తో పాటు మాతృత్వ బాధ్యతను స్వీకరించలేకపోయాను, బతకాలని కూడా అనిపించేది కాదు. మాతృత్వము ఎంత గొప్పదో, నేను ఎంత ఆనందంగా ఉంటే పిల్లవాడికి అంత మంచిది అని అందరు చెప్పిన, దుఃఖం ఎప్పుడు నన్ను వీడలేదు.
నాకు ఏమి జరుగుతుంది? ఇంకెవరికైనా ఇలా జరిగిందా?

సైకాలజిస్ట్ మాట: సరిత, ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్ ని పోస్టుపార్టుమ్ డిప్రెషన్ అని అంటారు. మీకున్న మానసిక పరిస్థితి ఇదే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ నివేదిక అనుసారం ప్రపంచ వ్యాప్తంగా 10-20% గర్భినులకు పోస్టుపార్టుమ్ డిప్రెషన్ వున్నది అని అంచనా.
కుటుంబానకి సూచనలు: గర్భవస్థ మరియు ప్రసవానంతరం సరితలో వచ్చే మానసిక మార్పులు భర్త మరియు కుటుంబ సభ్యులు గ్రహించాలి. సరిత మనసు మాటకు గౌరవం ఇచ్చి ఆమె పై వత్తిడి పెట్టకపోయినట్టయితే ఈ మానసిక పరిస్థితిని మీరు నివారించి ఉండేవారు.

సరితకు సూచనలు: సరిత, మీకు పోస్టుపార్టుమ్ డిప్రెషన్ రావటానికి ముఖ్య కారణాలు: పెళ్లి మరియు గర్భం దాల్చడం అన్నది కుటుంబ సభ్యుల నిర్ణయం కావటం, మీ జీవితం మీద మీకు కంట్రోల్ లేదు అన్న భావన, భర్త యొక్క సహాయ సహకారం లేకపోవటం, కుటుంబ సభ్యులు మీ భావాలకి మరియు నిర్ణయాలకి గౌరవం ఇవ్వకపోవటం వలన ఆత్మనున్యత భావన ఏర్పడింది. దీని వలన మీలో ఏ బాధ్యత చేయడానికి నేను తగను అన్న నమ్మకం బలపడడం వలన డిప్రెషన్ వచ్చింది

ట్రీట్మెంట్: కాగ్నీటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా మీ నమ్మకాలను మార్చి, మీ మీద మీకు నమ్మకం వచ్చేలా చెయ్యడం మరియు మీ మనసులోని భావాలను కుటుంబ సభ్యులకు తెలియబర్చటం, అలాగే మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఇతరులతో చర్చించి, ఒప్పించి తీసుకొనేలా చెయ్యటంవలన మీకు డిప్రెషన్ తగ్గుతుంది. థెరపీ తో పాటు మందులు తీసుకోవడం వలన మీరు ఈ పరిస్థితి నించి బయటపడగలుగుతారు ది మైండ్ వాయిస్: ఇతరలుకు ఆనందం పంచె క్రమం లో నీ ఆనందం మర్చిపోకు సరిత!

ఒక తల్లి-తండ్రి ఆరోగ్యం గా మరియు ఆనందంగా వున్నప్పుడే ఒక బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు/ఉంటుంది. తల్లి మరియు తండ్రి యొక్క మానసిక అనారోగ్యం పిల్లల పైన ప్రభావం చూపిస్తుంది. మరి అలాంటప్పుడు ఒక కుటుంబం, ఒక గ్రామం/పట్టణం, ఒక సమాజం మరియు దేశం గా మనం వీరికి చేయుత నివ్వటానికి సిద్దమైతేనే భవ్యమైన భారత దేశాన్ని నిర్మించగలుగుతాము. నేటి బాలలే రేపటి పౌరులు.


6. మెదడుకు మేత-సామెత శీర్షిక

ఈ సామెత పైకి చ‌మ‌త్కారంగా క‌నిపించినా, లోన కావ‌ల‌సినంత విష‌యం ఉంది. తెలియ‌డం అంటే జ్ఞానం. తెలియ‌క‌పోవ‌డం అంటే అజ్ఞానం. ర‌జ‌నీ కాంత్ సినిమా ఒక దానికి ఉప‌శీర్షిక ఇలా పెట్టారు. తెలిసింది గోరంత‌, తెలియాల్సింది కొండంత‌.. అన్నీ తెలిసిన వాడు, అంటే స‌ర్వ‌జ్ఞుడు ఈ ప్ర‌పంచంలో ఎక్క‌డా ఉండ‌డు. ఏమీ తెలియ‌క‌పోవ‌డం కూడా ఒక్కోసారి ప్ల‌స్ అవుతుందండోయ్… దీన్ని ప్లీజ‌ర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్.. అని రాబ‌ర్ట్ అండ్ లిండ్ అన్న ప్ర‌ముఖ ర‌చ‌యిత హాస్య‌వ్యంగ్య శోభితంగా చెప్పాడు. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నారు. జ్ఞాన‌మే బ్ర‌హ్మానందం! చిన్న పిల్ల‌లు చూడండి క‌త్తి తెగుతుంద‌ని తెలియ‌దు, పాము క‌రుస్తుంద‌ని తెలియ‌దు, స్వ‌చ్ఛంగా న‌వ్వుతుంటారు. మ‌నం అలాన‌వ్వ‌గ‌ల‌మా? చ‌ప్పండి. మ‌నం చ‌దివిన చ‌దువుకు లోక‌జ్ఞానానికి ఏ మాత్రం సంబంధం ఉండ‌దు. వెన‌క‌టికో బామ్మ‌గారు మ‌న‌వ‌డిని .. బీఏ చ‌దివావు తేలు మంత్రం రాదేమిరా… అని అడిగింద‌ట‌ ఇక ఏమీ తెలియ‌ద‌ని తెలుసుకోవ‌డ‌మే నిజ‌మైన వివేకం.

ద ఓన్లీ ట్రూ విస్‌డ‌మ ఈజ్ ఇన్ నాలెడ్జ్ ద‌ట్ యూ నౌ న‌త్తింగ్‌(The Only True Wisdom Is in the Knowledge That You Know Nothing) అని సోక్ర‌టీస్ మ‌హాశ‌యుడు సెల‌విచ్చాడు. ఇంట‌ర్వ్యూల‌లో వాళ్ల‌డిగిన ప్ర‌శ్న‌ల‌కు తెలియ‌క‌పోతే, నిఖాయితీగా నాకు తెలియ‌దు అని చెబితే కూడా దాన్ని పాజిటివ్‌గా ప‌రిగ‌ణిస్తార‌ట‌. అంతే కానీ అని అనుకుంటూ.. అని ఊహిస్తూ ఇలా డొంక తిరుగుడుగా నీళ్లున‌మిల్తే అంతే సంగ‌తులు! మ‌న‌కంతా తెలుసు అన్న గ‌ర్వం మ‌న‌ల్ని ప‌త‌నం చేస్తుంది. అది పోగొట్టుకోవాలంటే జ్ఞానుల ద‌గ్గ‌ర విన‌యంగా మెల‌గాలి. వారి ఔన్న‌త్యం ముందు మ‌న తెలివి ఎంత అల్ప‌మో తెలుస్తుంది. దీనినే భ‌ర్తృహ‌రి త‌న సుభాషిత‌ముల‌లో అందంగా చెప్పాడు. దీనికి ఏనుగు ల‌క్ష్మ‌ణ‌క‌వి గారి తెనిగింపు చూడండి. చం… తెలివి యొకింత లేని యెడ దృష్టుడ‌నై క‌రిభంగి స‌ర్మ‌ముల్‌

దెలిసితి నంచు గ‌ర్విత‌మీతిన్ విహ‌రించితి దొల్లి. ఇప్పుడు
జ్జ్వ‌ల మ‌తులైన పండితుల స‌న్నిధ నించుక బోధ‌శాలినై
తెలియ‌నివాడ‌నై మెల‌గితిన్ గ‌త‌మయ్యెని తాంత‌గ‌ర్వ‌ముల్‌.
నాకు తెలియ‌దు అనే మాట త‌ప్పించుకోవ‌డానికి కూడా భౌషుగ్గా ప‌నికొస్తుంది సుమంతీ! మ‌రో మంచి సామెత‌తో వ‌చ్చే వారం క‌లుద్దాం!


7.హృదయస్పర్శ (కథ)

గుండెల్లో గూడు కట్టిన జ్ఞాపకాలు, చల్లని సముద్ర తీరంలా హాయిగా కదలాడే గతం… ప్రతి శబ్దం, ప్రతి స్పర్శ, ప్రతి నీడ ఒక వెలకట్టలేని సంపదలా గుండెలో ఒదిగిపోతాయి. అటువంటి గుండె గదిలో, తల్లిదండ్రుల స్మృతులు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోవు—అవి శ్వాసలా, రక్తంలా, జీవనాడిలా మనలను నడిపిస్తాయి. ఇది వర్ధన్ కథ—తన తండ్రి జ్ఞాపకాలను గుండెలో బిగించి, జీవిత యుద్ధంలో నడిచే ఒక సామాన్యుడి కథ.

సాయంత్రం ఆరు దాటింది.. “పనిలో లీనమైతే, చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిచిపోతారేంటి?” గుర్నాధం గారి గొంతు వర్ధన్‌ను వాస్తవంలోకి తెచ్చింది. “చూడండి, ఆఫీసు స్టాఫ్ అందరూ వెళ్లిపోయారు. మీరూ నేనూ మాత్రమే మిగిలాం!”
“ఓ! సారీ, గుర్నాధం గారు, గమనించలేదు,” అంటూ చుట్టూ చూశాడు వర్ధన్. నిజమే! ఖాళీ కుర్చీలు నవ్వుతున్నట్లు కనిపించాయి. గోడ గడియారం 6:15 చూపిస్తోంది. చకచకా టేబుల్‌పై ఫైల్స్ సర్ది, డెస్క్‌కు తాళం వేసి, బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చాడు.
ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఉరుములు గుండెల్లో గుండు పేల్చినట్లు కదిలించాయి. ఏ క్షణమైనా వర్షం కుమ్మరించేలా ఉంది. స్కూటర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు—కానీ, ఫలితం లేదు. ఈ స్కూటర్… ఇంటర్ చదివే రోజుల్లో తండ్రి కొనిచ్చిన అమూల్యమైన బహుమతి. దాని ఇంజిన్ శబ్దంలో తండ్రి గుండె చప్పుడు వినిపించేది. అందుకే వర్ధన్‌కు ఈ స్కూటర్ కేవలం వాహనం కాదు—తండ్రి ఆత్మ లాంటిది. చేసేది లేక, స్కూటర్‌ను నడిపిస్తూ దగ్గరలోని మెకానిక్ షాపు వద్దకు చేరుకున్నాడు.

“ఇదిగో పాషాబాయ్, నా స్కూటర్ కాస్త చూడు. ఎందుకో స్టార్ట్ కావడం లేదు,” అంటూ స్టూల్ జరుపుకుని కూర్చున్నాడు. పాషా స్కూటర్‌ను పరిశీలిస్తూ, “సర్, ఎన్నోసార్లు రిపేర్ చేశాం. కానీ ఈ సమస్య మాత్రం మొదటికే వస్తోంది. స్పేర్ పార్ట్స్ దొరకడం లేదు. కొత్త స్కూటర్ తీసుకోండి సర్. కావాలంటే లోన్ నేనిప్పిస్తా!” అన్నాడు.

ఆ మాటలు వర్ధన్ గుండెలో గుచ్చుకున్నాయి. “పాషాబాయ్!” అన్నాడు, గొంతులో నిశ్చలమైన గాంభీర్యంతో. “నీ వయసు 40 దాకా ఉంటుంది. నీ తండ్రి వయసు 60 దాకా ఉండొచ్చు. అంత వయసులో కూడా నీవు నీ తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటావని పేరుంది. ఎవరైనా నీ తండ్రిని చులకనగా మాట్లాడితే నీకు ఎంత బాధ కలుగుతుంది? నా స్కూటర్ విషయంలోనూ అంతే! తల్లిదండ్రులను జ్ఞాపకాల్లో కాదు, గుండెల్లో నిలుపుకోవాలి. వారిచ్చిన ప్రతి వస్తువూ వెలకట్టలేని సంపద. ఈ స్కూటర్ నా తండ్రి జ్ఞాపకం. దీన్ని మార్చమని ఎప్పటికీ అనొద్దు. ఎంత ఖర్చైనా రిపేర్ చేస్తూ ఉండు. ఈ స్కూటర్ నాతో ఉన్నంతసేపూ, నా తండ్రి నన్ను ముందుకు నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది.”
వర్ధన్ మాటలు చెప్పుతూ స్కూటర్ వైపు చూస్తున్నప్పుడు, అతని కళ్లలో అనిర్వచనీయమైన వెలుగు మెరిసింది.

ఆ మాటలు పాషా గుండెను కదిలించాయి. తన తండ్రి ఇచ్చిన ప్రతి వస్తువును పదిలంగా దాచుకునే తాను ఇలా తప్పుగా మాట్లాడకూడదని అనిపించింది. కళ్లలో నీరు తిరిగింది.
“క్షమించండి, సర్! ఏదో పరధ్యానంలో అలా అనేశాను… మాఫ్ కీజియే!” అన్నాడు పాషా, కన్నీటితో తడిసిన కళ్లతో. “మీ స్కూటర్ నా తండ్రి జ్ఞాపకం లాంటిదే. ఇప్పుడు అర్థమైంది. ఎంత కష్టమైనా దీన్ని రిపేర్ చేస్తాను. మీ తండ్రి ఆశీస్సులు మీతో ఎప్పుడూ ఉంటాయి.”

వర్ధన్ లేచి, పాషా భుజం తట్టి, “పర్వాలేదు” అన్నట్లు సైగ చేశాడు. పాషా గుండెలో పశ్చాత్తాపం ఒక గుండె చప్పుడై మార్మోగింది. తన తండ్రి జ్ఞాపకాలను తాను ఎంత గౌరవిస్తానో, వర్ధన్ కూడా అంతే గౌరవంతో ఈ స్కూటర్‌ను చూస్తున్నాడని అర్థమైంది. “సర్, ఈ స్కూటర్‌ను నేను సొంతంగా చూసుకుంటాను. ఇది నాకూ ఒక బాధ్యతలా ఉంటుంది,” అని పాషా హృదయపూర్వకంగా అన్నాడు.

అప్పటివరకూ గర్జిస్తున్న ఆకాశం నక్షత్రాల వెలుగులతో ప్రశాంతంగా మారింది. ఇరువురి హృదయాల స్పందనలు ఒక జీవన రాగంలా ఆ రాత్రిలో మార్మోగాయి. వర్ధన్ స్కూటర్‌ను వదిలి, గుండెలో తండ్రి జ్ఞాపకాలను బిగించి ఇంటి దారి పట్టాడు. పాషా, ఆ స్కూటర్‌ను చూస్తూ, తన తండ్రి గుర్తొచ్చి, ఒక హృదయపూర్వక నిశ్చల హామీ ఇచ్చాడు—ఈ జ్ఞాపకాన్ని కాపాడే బాధ్యత తనది కూడా అని. స్కూటర్ ఎటువంటి సమస్య లేకుండా నడిచేలా చేయాలని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు.


8. వినరో భాగ్యము శీర్షిక

అధికమాసంలో రెండు బ్రహ్మోత్సవాలు

తిరుమల క్షేత్రంలో మూడేళ్లకొకసారి వచ్చే అధికమాసంలో ఏడాదికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా భాద్రపద మానంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలని, తర్వాత ఆశ్వయుజ మానంలో నిర్వహించే బ్రహ్మెత్సవాలను నవరాత్ర బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. రెండవ సారి నిర్వహించే బ్రహ్మెత్సవాలకు ధ్వజారోహణం ఉండదు. అంకురార్పణ జరిగిన మరు నటిరోజు ఉదయం బంగారు తిరుచ్చి వాహన సేవ మాత్రం జరుగుతుంది. అలాగే ఆ ఉత్సవాల్లో ఆరవరోజు సాయంత్రం నిర్వహించే వసంతోత్సవంలో భాగంగా స్వర్ణ రథోత్సవం బదులుగా విలక్షణరీతిలో అలంకరించిన భోగితేరుపై స్వామివారు ఉభయ దేవేరులతో ఊరేగుతారు.

మరిన్ని తిరుమల విశేషాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం.


9. సన్నిహితం…శీర్షిక.

వాటిని ఇంటికి తేవద్దు

ఒకరోజు నేను ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా నా కింద పని చేసే కుర్రాడు వచ్చి సెలవు కావాలి సార్ అని అడిగాడు. పిచ్చి కోపం
వచ్చింది నాకు. అసలే బోలెడంత పని వత్తిడి పైగా నా పై బాస్ నుండి తొందరగా పని కంప్లీట్ చెయ్యమని ప్రెజర్ . అందుకే విపరీతమైన చిరాకులో ఉంటే ఈ కుర్రాడు వచ్చి సెలవు అడుగుతున్నాడు. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే అతని మీద కోపం ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. పని చేయను అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. అందుకే అనునయంగా ” ఇప్పుడు చాలా పని ఉంది కదా ..సెలవు తర్వాత తీసుకుందువు గానీ ” అని ముద్దుగా చెప్పాను. ఆ కుర్రాడు గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
తర్వాత నా బాస్ పిలుస్తున్నాడు అని ప్యూన్ చెప్పడంతో ఆయన కేబిన్ కి వెళ్ళాను.
నన్ను చూసి ఎంతో ప్రేమగా ‘ పని ఎంతవరకు వచ్చింది ‘ అని అడిగాడు బాస్. వాడి దొంగ ప్రేమకు ఒళ్ళు మండింది నాకు. అయినా నవ్వు పులుముకుని అవుతుంది సార్ అని చెప్పాను.


” ప్రతీ రోజూ ఇదే మాట చెబుతున్నావు. పని మాత్రం ముందుకు సాగడం లేదు. ఇలా అయితే ఈ సారి నీకు ప్రమోషన్ ఇవ్వను ” అని మెత్తగా తిడుతున్నాడు బాస్. విపరీతమైన కోపం వచ్చింది నాకు. ఇంత పని చేసి టైమ్ కి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నా వీడికి సంతృప్తి లేదు అని మనసులో తిట్టుకుని పైకి మాత్రం ‘ అలాగే సార్..తొందరగా పని పూర్తి చేస్తాను ‘ అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాను.

ఆ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికీ..
నా భార్య ఎదురొచ్చి ” ఇంట్లో కూరగాయలు అయిపోయాయి , తీసుకురమ్మన్నాను తెచ్చారా ? ” అని అడిగింది. చిర్రెత్తుకొచ్చింది నాకు. పొద్దుటి నుండీ ఇంట్లోనే ఉన్నావు తెచ్చుకోవచ్చు కదా అని అరిచాను. ముఖం మాడ్చుకుంది ఆమె. ఇంతలో నా కొడుకు వచ్చి ‘ ఈ రోజు జరిగిన క్యాంపస్ సెలెక్షన్ లో నేను షార్ట్ లిస్ట్ కాలేదు డాడీ ” అని అన్నాడు. ‘ చీ..ఎందుకు పనికొస్తావురా .. వేస్ట్ ఫెలో ” అని తిట్టాను. తర్వాత అలా ఇంట్లో వాళ్ళమీద చిటపటలాడుతూనే ఉన్నాను. ఎప్పటికో నా కోపం చల్లారింది. అప్పుడు నా బుర్ర పనిచెయ్యడం మొదలు అయింది.
ఆఫీసు లో నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని తిట్టాను అని. ఆఫీసు వాళ్ళతో ఉండేది రోజుకు ఎనిమిది గంటలే కానీ ఇంట్లో వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండాలి కదా.కానీ ఆఫీసు వాళ్ళతో మంచిగా ఉండి ఇంట్లో వాళ్ళని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాను. నా తప్పు తెలుసుకున్నాను. ఇక మీదట బయట టెన్షన్స్ అన్నీ గుమ్మం బయటే వదిలి ఇంట్లోకి రావాలి అని నిర్ణయించుకున్నాను.


మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ ఐడి.
 prabhanewscontent@gmail.com

Leave a Reply