Students l భావిభారత పౌరులను సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దాలి..

Students l భావిభారత పౌరులను సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దాలి..
Students l భవానిపురం, ఆంధ్రప్రభః ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ, యంత్ర భాష (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్) వంటి ఆధునిక సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యువత ఆయా కోర్సులను తమ వృత్తి విద్యతో అనుసంధానించుకుని ముందుకు సాగితే అత్యుత్తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ తాళ్లపల్లి సాయిసుధీర్ పేర్కొన్నారు. విజయవాడ ఒన్‌టౌన్‌లోని ఎస్‌ఆర్‌ఎస్‌వి బీఈడీ కళాశాలలో డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన పూర్వ విద్యార్థులకు నిర్వహించిన సత్కార సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదేనని, భావిభారత యువతను తీర్చిదిద్దే శక్తి గురువులకే ఉందని అన్నారు.
అన్నదానం ఆకలిని తీరిస్తే, అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భావనను ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు బలంగా ఉంటే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, అక్షరాస్యత పెరిగి బాల్య వివాహాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడం శుభపరిణామమని, భావి ఉపాధ్యాయులు పొందుతున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ రంగంలో మంచి సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎస్‌వి బీఈడీ కళాశాల సెక్రటరీ ఎం.సతీష్‌కుమార్, ప్రెసిడెంట్ మహంకాళి మోహనరావు, పూర్వ సెక్రటరీ జి.గంగాధర్, కెబిఎన్ కళాశాల సెక్రటరీ డాక్టర్ టి.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ–2025లో ఉద్యోగాలు సాధించిన 35 మంది పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
