శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో నేడు పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికులు తెర్లంగి రామారావు, బడబంద అప్పన్న, తమిళనాడుకు చెందిన వంగ వేణు ఆర్ముగంగా గుర్తించారు. క్వారీలో భారీ పేలుడు సంభవించిందని, ఆపై పిడుగుపడినట్లు వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై కార్మికుల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.
ఇది సాధారణ ప్రమాదం కాదని పేలుడు కారణంగానే కార్మికులు మృతిచెందారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఘటన జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లి విచారణ ప్రారంభించారు. కార్మికుల మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని కార్మికుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాత కార్మికుల మృతిపై అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.