Smart phone | లైకులు లక్షల్లో… విలువలు మైనస్‌లో?

Smart phone | లైకులు లక్షల్లో… విలువలు మైనస్‌లో?
Smart phone | స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఎంత భాగం?
వైరల్ సంస్కృతి – మారుతున్న ప్రాధాన్యతలు
కంటెంట్ కంటే కంట్రోవర్సీ ఎందుకు?
సమాజంపై సోషల్ మీడియా ప్రభావం
మార్పు మన చేతుల్లోనే ఉంది
Smart phone | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఉదయం కళ్లు తెరిచేలోపే చేతిలోకి జారేది ఫోన్.
రాత్రి కళ్లుమూసేలోపే చివరిసారి చూసేది కూడా అదే.
ఇంతలోపు మన జీవితం ఫోన్‌లోకి వెళ్లిపోయిందా? లేక ఫోన్ మన జీవితంలోకి వచ్చి కూర్చుందా? అన్నది ఇప్పుడు సందేహం.

స్మార్ట్‌ఫోన్ తప్పు కాదు. సోషల్ మీడియా కూడా తప్పు కాదు. కానీ… వాటిని మనం ఎలా వాడుతున్నామన్నదే అసలు కథ.
ఒకప్పుడు “ఏం చెప్పాలి?” అనేది ముఖ్యం. ఇప్పుడు “ఎలా వైరల్ అవ్వాలి?” అనేదే ముఖ్యమైపోయింది.

అక్కడే గేమ్ మారింది. సమాచారం కంటే సంచలనం… విలువల కంటే వ్యూస్… అర్ధం కంటే అశ్లీలత…
ఇవి ఇప్పుడు సోషల్ మీడియా లో సరికొత్త ఒరవడి…ట్రెండ్…ఎవరు ఎక్కువగా షాక్ ఇస్తే… వాళ్లే స్టార్.
ఎవరు ఎక్కువగా బూతులు మాట్లాడితే… వాళ్లే ట్రెండ్. ఇంతకీ ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌నా? లేక ఓపెన్‌గా జరుగుతున్న విలువల పతనమా? వీడియోల్లో మాటలకి బదులు బూతులు…కంటెంట్‌కి బదులు కంట్రోవర్సీ…ఇవి ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్‌లో పరుగెడుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే… “రీల్” కంటే “రీయాక్షన్” ఎక్కువ. యూట్యూబ్‌లో క్లిక్ చేస్తే…
థంబ్‌నెయిల్ చూసి సిగ్గుపడాలా? నవ్వాలా? అన్న సందిగ్ధం.
ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తే… ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఎలాంటి “ఎక్స్‌పెరిమెంట్స్” జరుగుతున్నాయో అర్థం కాదు.

పెద్దవాళ్లు చూసి పక్కన పెట్టొచ్చు. కానీ చిన్నపిల్లలు? వాళ్లు చూస్తున్నది ఏంటో…అది వాళ్ల మనసులో ఏం నాటుతుందో…ఎవరూ ఆలోచించే టైమ్ కూడా తీసుకోవడం లేదు. ఒక్కసారి అలవాటు పడితే…
అది కేవలం వీడియో కాదు… అలవాటు. మళ్లీ మళ్లీ అదే వెతుక్కునే స్థితి. ఇంకా విచిత్రం ఏమిటంటే…
ఇది తప్పు అని తెలిసినా…చూడటం మాత్రం ఆపడం లేదు. ఇంకొందరైతే…“ఏం ఉంది ఇందులో?” అంటూ లైట్ తీసుకుంటున్నారు. బూతు మాటలతో నవ్వించడం…ద్వంద్వార్థాలతో ఆకట్టుకోవడం…ఇవి ఇప్పుడు “క్రియేటివిటీ”గా మారిపోయాయి.
వ్యూస్ వస్తే చాలు…లైక్స్ పెరిగితే చాలు…అంటే…డబ్బు వస్తే చాలు. అక్కడితో బాధ్యత ముగిసింది. చట్టాలు ఉన్నాయి…రూల్స్ ఉన్నాయి…కానీ…వాటిని ఫాలో అయ్యే వారు ఎవరూ లేరు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే…బూతు వీడియోలకు వేలల్లో షేర్లు… లక్షల్లో లైకులు.

సాధారణంగా మంచి కంటెంట్‌కు వచ్చే స్పందన కంటే… ఇవే ఎక్కువ. అయితే అసలు ప్రశ్న ఇదే—మనమే చూస్తున్నాం…మనమే షేర్ చేస్తున్నాం…మనమే వైరల్ చేస్తున్నాం…అయితే తప్పు ఎవరిది? సోషల్ మీడియా దా? లేక మన అలవాట్లదా? జవాబు కాస్త కఠినమే… కానీ నిజం ఒక్కటే— బూతులకు జై కొట్టేది వాళ్లు కాదు…మనమే. అందుకే… లైక్ కొట్టేముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మనమే మారితే…ఈ ట్రెండ్ కూడా మారుతుంది. లేకపోతే… లైకులు పెరుగుతాయి… విలువలు తగ్గుతాయి.
