Singareni | పచ్చదనం పెంపుదలకు కన్హా ఆశ్రమంతో ఒప్పందం

సింగరేణి గని ప్రాంతంలో పచ్చదనాన్ని పెద్ద ఎత్తున పెంచాలన్న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల ఆదేశాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ గనుల ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటడానికి, పలు రకాల పర్యావరణహిత చర్యలు చేపట్టడానికి ప్రముఖ యోగా, పర్యావరణ పరిరక్షణ సంస్థ అయిన హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ (కన్హా ఆశ్రమం) వారితో సింగరేణి సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

గురువారం హైదరాబాద్ కు సమీపంలోని కన్హా శాంతి వనం ఆశ్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం పై సింగరేణి సంస్థ నుండి సీఎండీ ఎన్. బలరామ్, హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ నుండి డైరెక్టర్ సంజయ్ సెహగల్ సంతకాలు చేశారు.

ఇదే తరహా ఒప్పందాన్ని కోల్ ఇండియా కూడా హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సింగరేణి ప్రాంతంలో కన్హా ఆశ్రమం (హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున మొక్కలను నాటడం, పెంచడంతో పాటు ఎకో పార్కులను నిర్మించడం, వర్షారణ్యాలు, హరిత కంచెల ఏర్పాటు వంటి పర్యావరణహిత చర్యలు చేపట్టనున్నారు.

ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ డంపుల మీద, ఖాళీ ప్రదేశాలలో, బొగ్గు రవాణా బెల్టులకు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచనున్నారు. ప్రతీ ప్రదేశంలో నాటిన మొక్కలు 90% పైబడి పాదుకొని వృక్షాలుగా పెరగడానికి కృషి చేస్తారు. ఈ కార్యక్రమాలలో సమీప గ్రామాల ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ, వారి అవసరాలకు, ఉపాధి కల్పనకు కూడా హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది.

సింగరేణి సంస్థ ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా కృషి చేస్తుంది. 14,900 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 7 కోట్ల మొక్కలను నాటి వాటిని వనాలుగా పెంచుతోంది కాగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల ఆదేశం మేరకు ఈ చర్యలను మరింత ఉధృతం చేసేందుకు కన్హా ఆశ్రమం (హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్) వారితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న ఆరు జిల్లాలలో అవసరమైన చోట ఈ తరహా పర్యావరణహిత చర్యలు చేపట్టడానికి కన్హా ఆశ్రమ సహకారాన్ని తీసుకోవడానికి ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది అన్నారు. కన్హా ఆశ్రమం వారు యోగా కార్యక్రమాలు, పర్యావరణహిత చర్యలను పెద్ద ఎత్తున చేపట్టి మంచి పేరును సాధించారని, ఈ సంస్థతో కలిసి సింగరేణిలో పర్యావరణహిత మరియు సమాజహిత కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి రూపేంద్ర బ్రార్, సింగరేణి డైరెక్టర్ పా గౌతం పొట్రు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply