13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు..

- లీవ్ యాప్ లో నమోదు చేయని కారణంగా.. చర్యలు
- జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఉపాధ్యాయుల అంకితభావం, విధి నిర్వహణపై సమీక్ష చేపట్టిన విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 25న లీప్ (LEAP) యాప్‌లో హాజరు నమోదు చేయని 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు.
గత నెల 25వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు లీప్ యాప్‌లో తమ హాజరును నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మండలాల వారీగా పరిశీలన జరిపిన అనంతరం మొత్తం 13 మంది ఉపాధ్యాయులు అటెండెన్స్ నమోదు చేయకపోవడం నిర్ధారణ అయ్యిందన్నారు.
లీప్ యాప్‌లో హాజరు నమోదు చేయడం శాఖ ఆదేశాల ప్రకారం తప్పనిసరి. దీనిని ఉల్లంఘించిన వారిపై నియమావళి ప్రకారం కఠిన చర్యలు తప్పవని శ్యాముల్ పాల్ హెచ్చరించారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, వివరణ సమర్పించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.
విద్యార్థుల హాజరు, బోధన పర్యవేక్షణ, పాఠశాలల్లో బోధన ప్రమాణాల అమలు వంటి అంశాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం లీప్ యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పాఠశాల నిర్వహణ పారదర్శకంగా నమోదు అవుతోంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లాలో విద్యా ప్రమాణాలను కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు తెలిపారు.
జిల్లాలో ఉపాధ్యాయుల అనుసరణ, విధేయత, డిజిటల్ విధానాల అమలు వంటి అంశాలపై ఇటువంటి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
