sharmila | నిధులపై నిలదీయండి

sharmila | నిధులపై నిలదీయండి

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అమరావతి రాజధాని అంశంపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడం హర్షణీయమేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. అయితే విభజన చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 94(3) అమలుపై ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉందని ఆమె ప్రశ్నించారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమేనని పేర్కొన్న ఆమె, అదే స్థాయిలో అమరావతి నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం నుంచి హక్కుగా సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గెజిట్ ప్రకటనలతోనే అమరావతి అభివృద్ధి సాధ్యమవుతుందా అని ఆమె ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని విభజన చట్టం స్పష్టంగా చెబుతుందని, సెక్షన్ 94(3) ప్రకారం అవసరమైన మొత్తం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిధుల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యంపై అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి తగిన నిధులు రాకపోతే ప్రజలపై అప్పుల భారాన్ని మోపాల్సి వస్తుందని, లక్ష కోట్ల రూపాయల వ్యయాన్ని రాష్ట్ర ప్రజలపై మోపడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాల్సిందేనని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply