SCAM | కోట్ల రూపాయల భూ కుంభకోణం..

SCAM | కోట్ల రూపాయల భూ కుంభకోణం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో నకిలీ భూ పత్రాలతో కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అక్రమంగా (SCAM) స్వాధీనం చేసుకునే ప్రయత్నం బయటపడింది. ఈ భూ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన చౌటుప్పల్ పోలీసులు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిరికంటి నిరంజన్ గౌడ్, పూర్వ ఆర్‌ఐ ఉప్పు రాజేష్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ బుధవారం రాత్రి వెల్లడించారు.
ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, చౌటుప్పల్ తహశీల్దార్ వీరాబాయి జిల్లా కలెక్టర్‌కు పంపిన రిపోర్ట్ మరియు పక్కీర్ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టారు. సర్వే నంబర్ 42లో ఉన్న ఏ 3.05 గుంటల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి నిరంజన్ గౌడ్ తమ పేర్లపైకి మళ్లించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్డీవో లేఖ నం. A/297/2024 ప్రకారం, ఆ భూమి బ్లాక్‌లిస్ట్‌లో ఉందని, అసలు యజమాని తెల్లపాటి భూపేష్ అని విచారణలో తేలినట్లు తెలిపారు.
1994లోని సాదా రిజిస్ట్రేషన్‌ను ఆధారంగా చూపుతూ, 2007లో నకిలీ 13-బి (B/4835/2006) సృష్టించారు. అంతేకాదు, 2019లో మరో నకిలీ ప్రొసీడింగ్స్ (B/1810/2018) తయారు చేసిన విషయాన్ని మాజీ తహశీల్దార్ సహా పలువురు అధికారులు లిఖితపూర్వకంగా ధృవీకరించారు. మాజీ వీఆర్వో తనీర్ విజయ్‌కుమార్, అదనపు ఆర్‌ఐ సైదిరెడ్డి పేర్లతో రూపొందించిన రిపోర్టులు కూడా పూర్తిగా నకిలీవేనని విచారణలో నిర్ధారితమైంది.
ఈ సంబంధిత నకిలీ పత్రాలన్నింటినీ చౌటుప్పల్ తహశీల్దార్ పోలీసులు అందజేయడంతో, క్రైమ్ నెంబర్ 808/2025 కింద కేసు నమోదు చేశారు. తదనంతరం ప్రధాన నిందితులు దండు మల్కాపురం గ్రామానికి చెందిన గిరికంటి నిరంజన్ గౌడ్, వనస్థలిపురంలో నివసించే జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉప్పు రాజేష్, నెల్లూరు జిల్లా గువ్వాడికి చెందిన భోగినేని మోహన్‌రావు, దండు మల్కాపురం గ్రామానికి చెందిన అత్తాపురం నరేందర్‌రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ తెలిపారు.
