Initiation | జీతం కోసం పారిశుధ్య కార్మికురాలి మౌన దీక్ష

Initiation | జీతం కోసం పారిశుధ్య కార్మికురాలి మౌన దీక్ష

  • 8 నెలలుగా జీతం చెల్లించని వైనం

Initiation | విజయవాడ (కార్పోరేషన్) ఆంధ్రప్రభ : విజయవాడ కార్పోరేషన్ పరిధిలో గత ఎనిమిది నెలలుగా జీతం రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు అన్నవరపు వీరమ్మ శుక్రవారం ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద మౌన దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు ఏఐటీయూసీ నాయకులు, విజయవాడ మున్సిపల్ వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా.. వీరమ్మ దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలలుగా 40 వ డివిజన్ లో పని చేస్తున్న చిన్న చిన్న కారణాలు చెప్పి జీతం చెల్లించకపోవడం దారుణమని అన్నారు. కమిషనర్ పదే పదే చెప్పినప్పటికీ క్రింది స్థాయి అధికారులు అలసత్వం వహించటం మహిళా కార్మికురాలు పట్ల అమానుషంగా ప్రవర్తించటమేనని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికురాలు వీరమ్మ మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలలుగా జీతం రాక అప్పులు చేసి చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక ఇబ్బందులు పడి జీవనం సాగించటం కష్టంగా ఉందని అధికారులు తన పట్ల చిన్న చూపు చూడటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కమిషనర్ గత రెండు నెలలుగా చెబుతున్నప్పటికీ పట్టించు కోకపోకుండా కమిషనర్ వద్ద తన ఇబ్బందులు తెలుపుకుంటే చేస్తున్న పని కూడా ప్రస్తుతం రావక్కర్లేదని పక్కన పెట్టడం దుర్మార్గపు చర్య అని అన్నారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి నాయకులు అండతో మౌన దీక్ష చేపట్టిన వీరమ్మ ను నగరపాలక సంస్థ సీఎం హెచ్ ఓ వచ్చి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తానని అందరి సమక్షంలో వాగ్దానం చేయడంతో వీరమ్మ తాత్కాలికంగా దీక్షను విరమించుకున్నది. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, మినిస్ట్రియల్ అండ్ అల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ధారా రాంబాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు జక్కీ జేమ్స్, ఉపాధ్యక్షులు తుపాకుల ప్రతాప్, కోశాధికారి తుపాకుల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply