Rs.30 lakhs | రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు…

Rs.30 lakhs | రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు…
Rs.30 lakhs | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రైస్ పుల్లింగ్ మాఫియా కేసులో వైసీపీ తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కీ బాబును శనివారం కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో పలువురికి భారీగా మోసాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో డిక్కీ బాబు ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.
రైస్ పుల్లింగ్లో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి కోట్ల రూపాయలు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కడపకు చెందిన ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.30 లక్షలు తీసుకుని ఎటువంటి ఫలితం చూపకుండా మోసం చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన కదిరి పోలీసులు డిక్కీ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ వ్యవహారంలో మరికొంత మంది బాధితులు ఉన్న అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో సాగుతున్న మోసాలపై ఇప్పటికే వివిధ జిల్లాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కేసు కూడా పెద్ద ఎత్తున దర్యాప్తుకు దారితీసే అవకాశం ఉంది. డిక్కీ బాబు ద్వారా మరెవరెవరు మోసపోయారన్న దానిపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు.
