ముష్టిబండలో రోడ్డు ప్రమాదం

ముష్టిబండలో రోడ్డు ప్రమాదం
- బొలెరోను ఢీకొట్టిన లారీ..
- ఒకరికి గాయాలు
- 3,000 బాతులు మృతి
దమ్మపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ముష్టిబండ–మొద్దులగూడెం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 3,000 బాతులు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడువాయి గ్రామం నుంచి తిరువూరుకు సుమారు 4,000 బాతులతో వెళ్తున్న బొలెరో వాహనం, ముష్టిబండ సమీపంలోని ఒక ధాబా వద్ద రోడ్డుపక్కన నిలిపి ఉంచారు. అదే సమయంలో మొక్కజొన్న లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి, ఆగి ఉన్న బొలెరోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాలు రోడ్డుపక్కకు దూసుకెళ్లాయి. బొలెరోలో ఉన్న బాతుల్లో సుమారు 3,000 బాతులు అక్కడికక్కడే మృతి చెందాయి. లారీలో ఉన్న ఒక వ్యక్తికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం అశ్వరావుపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం జేసీబీ సహాయంతో ప్రమాదంలో పడిపోయిన వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
