TG |రేవంత్ నీరో చక్రవర్తే.. కేటీఆర్

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ నీరో చక్రవర్తి తరహాలో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు చెందిన మాజీ జ‌డ్పిటీసీ కీర్తి వెంక‌టేశ్వ‌ర్లు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్కిరెడ్డి రాజేశ్వ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీని వ‌దిలిపెట్టి.. ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలో హ‌స్తం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చేరుతున్నారంటే రేవంత్ ప్ర‌భుత్వం ప‌త‌నానికి సంకేతం అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

15 నెల‌ల కాలంలోనే అధికార పార్టీని వ‌దిలిపెట్టి బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే.. ఆ పార్టీ పాల‌న ఏంటో అర్థ‌మ‌వుతుంద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంటేనే ప్ర‌జ‌ల‌కు విసుగు వ‌చ్చింద‌న్నారు. రేవంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లోనూ ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌లో చేరారు. 15 నెల‌ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్ర‌జ‌ల‌కు కోపం వ‌స్తుందని కేటీఆర్ తెలిపారు.

గ‌త 48 గంట‌ల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇంకో దిక్కు ఎస్ఎల్బీసీ వ‌ద్ద ప్ర‌మాదం జ‌రిగి 8 మంది కార్మికులు సొరంగంలో ఇరుక్కుపోయారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నాడు. ఆ ఎన్నిక‌తో గ‌వ‌ర్న‌మెంట్ మారేది లేదు.. ప్ర‌భుత్వం త‌ల‌కిందులు అయ్యేది లేదు. కానీ దాని కోసం హెలికాప్ట‌ర్‌లో పోయి మాట్లాడుతున్నాడని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

రైతు ఆత్మ‌హ‌త్య‌లు, కార్మికులు ఇరుక్కుపోతే సోయి లేకుండా గాల్లో చ‌క్క‌ర్లు కొడతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా 36వ సారి ఢిల్లీకి పోయిండు. ఏం పీకారు ఢిల్లీకి వెళ్లి. క‌నీసం మంత్రివ‌ర్గ విస్త‌రణ‌ కూడా చేసుకోలేక‌పోతున్నాడు. రాష్ట్రానికి హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేడు. మంత్రుల‌ను నియ‌మించుకోలేని అస‌మ‌ర్థ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను, ఆయ‌న ఆన‌వాళ్ల‌ను మాయం చేస్తా అంటుండు. తెల్లారిలేస్తే కేసీఆర్ జ‌పం చేయ‌ని రోజు ఉండ‌దు. నిద్ర‌లో కూడా కేసీఆరే యాదికి వ‌స్తున్న‌ట్లుంది. వాస్త‌వం ఏందంటే.. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ద‌గ్గ‌రి దోస్తుల‌కు ఇలా చెప్పుకున్న‌డంట‌.. మ‌నం గెలుస్త‌లేం.. ప్ర‌తిప‌క్షంలో ఉండి గ‌ట్టిగా కొట్లాడాలి.. కేసీఆర్ ఉన్న‌న్ని రోజుల గెలువం అని చెప్పుకున్న‌డ‌ట‌. కానీ ప్ర‌జ‌లు ల‌క్కీలాట‌రీలో ఆయ‌న‌ను గెలిపించార‌ని కేటీఆర్ తెలిపారు.

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్ … కడియంకు సవాల్

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. టీవల తాను లగచర్లకు వెళ్లానని, వేలాది మంది రైతులు తరలివచ్చారని, రేవంత్ రెడ్డిని తరిమి కొడతామని వారు అంటున్నారని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే రేవంత్ రెడ్డికి దిక్కు లేదు, ఇక కడియం శ్రీహరిని ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నిత్యం నీతులు మాట్లాడే కడియం శ్రీహరికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందని ఆయన భావిస్తే రాజీనామా చేయాలని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని, పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైందని ఆయన అన్నారు. అయినా గాడిదను చూస్తేనే గుర్రం విలువ, చీకటిని చూస్తేనే వెలుతురు విలువ తెలుస్తుందని ఆయన అన్నారు. అలాగే రేవంత్ రెడ్డిని చూశాక కేసీఆర్ అంటే ఏమిటో అర్థమవుతోందని అన్నారు. తెలంగాణలో దోచుకొని ఢిల్లీలో కప్పం కడుతున్నాడని ఆరోపించారు.

కొడంగల్‌లోని లగచర్లలో లంబాడ సోదరుల భూములు లాక్కునే ప్రయత్నం చేశారని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. స్థానిక రైతులు అధికారుల వద్ద నిరసన తెలపడంతో, రేవంత్ రెడ్డి అహం దెబ్బతిని 40 మందిని జైల్లో పెట్టారని ఆయన అన్నారు. తాము న్యాయపోరాటం చేసి రైతులను జైళ్ల నుండి విడిపించామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *