Gongadi Trisha | హైదరాబాద్ కు చేరుకున్న వరల్డ్ కప్ సెన్సెషన్..
- ఘనంగా స్వాగతం పలికిన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
- గొంగిడి త్రిషకు ఎయిర్ పోర్ట్ లో అభిమానుల అభినందనలు
- మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్ష.
హైదరాబాద్ : మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ ఆసాంతం రాణించిన త్రిష ఆల్‌రౌండర్ ప్రదర్శనతో భారత్‌కు రెండోసారి ప్రపంచకప్ అందించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గాను నిలిచింది.
భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్వాగతం పలికారు.
ఆమెతో పాటు క్రికెటర్ ద్రితి కేసరి, హెడ్ కోచ్ నుషిన్, ట్రైనర్ షాలిన్ కూడా అదే విమానంలో వచ్చారు.. వారికి సైతం సాదరపూర్వక స్వాగతం లభించింది. త్రిషను ఆదర్శంగా తీసుకుని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.
ఇక ఈ వరల్డ్ కప్ లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది. అంతేగాక ఈ టోర్నీలో నమోదైన ఏకైక శతకం చేసింది కూడా మన త్రిషనే. కాగా, త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. రెండేళ్ల వయసుకే బ్యాట్ పట్టిన త్రిష… 9 ఏళ్లకే హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడి సత్తా చాటింది. ఆ తర్వాత అండర్-23 కేటగిరీలోనూ ఆడింది. 19 ఏళ్లకే స్టార్ క్రికెటర్‌గా, టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగిన త్రిష భవిష్యత్తులో భారత జట్టుకు సారథ్యం వహించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.