”ఉపకారికి ప్రత్యుపకారము”

”కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ: సనాతన:” తనకు ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలన్నది అనాదిగా మన ధర్మమని వాల్మీకి రామాయణం అంటుంది. ప్రత్యుపకారము చేసే గుణం ఉత్తములకే ఉంటుంది. ఆ అవకాశం లభించడం కూడా అదృష్టమే! ”ఎదుటివారికి నీవు చేసే మేలు నీకు నీవు చేసుకొంటున్న మేలుగా భావించ”మంటారు భగవాన్‌ శ్రీరమణ మహర్షి. ఎందుకంటే అందరిలోనూ ఉన్న పరమాత్మ ఒక్కడే. అందుకే ”తనయందు నిఖిల భూతములందు నొక భంగి” ప్రవర్తించమని భాగవతం బోధిస్తోంది. కృతజ్ఞతతో చేసిన ప్రత్యుపకారం ఎంత గొప్పగా శోభిస్తుందో ఒక చిన్న ఉదాహరణ మనకు తెలుపుతుంది.
స్కాట్‌లాండ్‌లో ఒక పేద రైతు తనపొలంలో పనిచేసుకొంటుండగా అతనికి కొందరు పిల్లల ఆర్తనాదాలు వినిపించి అటువైపుకు పరుగు పరుగున వెళ్ళాడు. అక్కడ చెరువులో బురద బాగా ఉన్న భాగాన ఒక బాలుడు దిగబడిపోతూన్నాడు. ఆ అబ్బాయి స్నేహితులు అతడిని కాపాడే ప్రయత్నంలో విఫలులై కేకలు వేస్తూ చెరువు గట్టున నిలబడి ఉన్నారు. రైతు వెంటనే ఆ పిల్లల సహాయంతో ఒక పెద్ద దుంగను తీసుకొని, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఆ బాలుని సమీపానికి చేర్చి, అతికష్టం మీద ఆ అబ్బాయిని గట్టుకు చేర్చి శుభ్రపరచి, ధైర్యం చెప్పి, కాసేపయ్యాక అతని స్నేహితుల వెంట పంపాడు. మరుసటి రోజు ఆ రైతు పొలం వద్దకు ఒక కారు వచ్చి ఆగింది. అందులోనుండి ఇంగ్లాండ్‌కు చెందిన ఒక సంపన్నుడైన వ్యక్తి దిగి రైతు వద్దకు వచ్చి క్రితం రోజు కాపాడబడిన బాలుడు తన కుమారుడనీ, అతడిని ఆపదనుండి రక్షించినందుకు రైతుకు కృతజ్ఞతలు చెప్పుకోడానికి స్వయంగా వచ్చాననీ చెప్పి, బహుమానంగా ఎంత విలువైన కానుక ఇచ్చినా సరితూగదు కానీ తన తృప్తి కోసం రైతు అడిగిన దేనినైనా ఇవ్వాలనుకుంటున్నానని మిక్కిలి గౌరవంగా పలికాడు. రైతు చిరునవ్వు నవ్వి, మానవత్వంతో తాను చేసిన పనికి వెలకట్టవద్దనీ, తనకే బహుమానం వద్దనీ వినయంగా బదులిచ్చినాడు. అప్పుడు ఆ సంపన్నుని దృష్టి పొలం పనులలో ఆ రైతుకు సహాయం చేస్తున్న ఆతని కొడుకుపై పడింది. ”అయ్యా ! మీరు కాదనకండి. మీ అబ్బాయిని, అతడెంత వరకు చదివితే అంత వరకు ఇంగ్లాండ్‌లోని అత్యున్నత విద్యా సంస్థలలో చదివిస్తాను. నాకు ఈ అవకాశాన్ని ఇవ్వమని” అతడు రైతును ప్రాధేయ పడ్డాడు. కొడుకు ఉజ్వల భవిష్యత్తును తోసివేయలేక రైతు అంగీకరించి తన కొడుకును సంపన్నుని వెంట పంపాడు. ఆ బాలుడు ఉన్నత విద్యలలో రాణించి, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగి ”పెన్సిలిన్‌” అనే మహత్తరమైన ఔషధాన్ని కనుగొనగలిగాడు. అతడే అలెగ్జాండర్‌ ప్లెమింగ్‌. అతని తండ్రి చేత రక్షింపబడిన అబ్బాయే విన్‌స్టన్‌ చర్చిల్‌. బ్రిటీష్‌ ప్రధానిగా సుప్రసిద్ధుడైన ఆయన ఒకసారి న్యుమోనియా వ్యాధితో దాదాపు మరణం అంచుకు చేరినప్పుడు ప్లెమింగ్‌ తన పెన్సిలిన్‌తో అతనికి జబ్బు నయం చేసి పునర్జన్మను ఇచ్చాడని అంటారు.
కనుక మంచి మనసుతో, మానవత్వంతో, కృతజ్ఞతా భావంతో చేసే పనులు ఎల్లప్పుడూ వారికే కాక వారి కుటుంబాలకుకూడా మహత్తర ఫలితాలను ఇస్తాయని మనం ఎప్పుడూ మరువరాదు.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Leave a Reply