లండన్ లో నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం

లండన్ లో నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్ పర్సన్ నారా భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఓ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ఆమె రెండు పురస్కారాలను స్వీకరించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ ఆమెకు డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025ను ప్రదానం చేయగా, హెరిటేజ్ ఫుడ్స్‌కు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో భువనేశ్వరి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ ను అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు వంటి ఎన్నో సేవలను ఆమె అందిస్తున్నారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తమార్పిడి చేయించడం, విద్యార్థులకు సహాయ పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయడం వంటి కార్యక్రమాలతో ఆమె ప్రజల మన్ననలు పొందారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే.. ఒకే వేదిక పై చంద్రబాబు నాయుడు ప్రసంగించడం.. భువనేశ్వరి పురస్కారాలు అందుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Leave a Reply