Railway Coach | ఓరుగల్లు ప్రజల 30 ఏండ్ల క‌ల‌

Railway Coach | ఓరుగల్లు ప్రజల 30 ఏండ్ల క‌ల‌

  • మార్చి నుంచి రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్ ప‌నులు..
  • ఏడాదికి 600 కోచ్ లు తయారవుతాయి
  • రైల్వే యూనిట్ పనుల్లో జాప్యం లేకుండా చూడాలి
  • స్థానికులకు అన్యాయం జరగకుండా చూస్తాం
  • భూములు కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలకు ప్రయత్నిస్తా
  • వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
  • రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన ఎంపీ కడియం కావ్య

ఆంధ్రప్రభ సిటీ బ్యూరో, వరంగల్ : రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు వచ్చే మార్చి నెల నుంచే ప్రారంభం కానున్నాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఈ యూనిట్‌లో ఏడాదికి 600 కోచ్‌లు తయారు చేయనున్నారని వెల్లడించారు. రైల్వే యూనిట్ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా మరింత వేగవంతం చేయాలని రైల్వే అధికారులను ఆమె కోరారు.

కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనుల పురోగతిని వర్ధన్నపేట శాసనసభ్యుడు కేఆర్ నాగరాజుతో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం పరిశీలించారు. యూనిట్‌లో జరుగుతున్న పనుల పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి, విభాగాలవారీగా జరుగుతున్న నిర్మాణ కార్యక్రమాలపై ఆమె రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, “కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఓరుగల్లు ప్రజల 30 ఏళ్ల స్వప్నం. ఇప్పుడు అది నెరవేరబోతోంది. ఇది కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం,” అని పేర్కొన్నారు.

భూములు కోల్పోయిన వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. భూబాధితులు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఇదే అంశంపై కేంద్ర రైల్వే మంత్రిని కలిసి కోరిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానికులకు ఉద్యోగాల కల్పన అంశంపై పార్లమెంట్‌లో కూడా తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.

రైల్వే యూనిట్‌లో ఎక్కడైనా పనులు జాప్యం జరగకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఎంపీ కడియం కావ్య అధికారులకు సూచించారు. అనంతరం రైల్వే అధికారులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నమూనా వివరాలను ఎంపీకి వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎంఈ ఆనంద్, జిజిఎం మురళీ కృష్ణ, డిజిఎం శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply