హైదరాబాద్: హైదరాబాద్ హెచ్ఎస్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. లగచర్ల గ్రామం, సుంకిశాల, ఏదైనా హైడ్రా కూల్చివేత ప్రదేశం, మూసీ కూల్చివేతల ప్రాంతం, హెచ్సీయూ కంచ గచ్చిబౌలిని సందర్శించాలని ‘ఎక్స్’ వేదికగా సూచించారు.
కలుషితాహారం కారణంగా మరణించిన గురుకుల విద్యార్థుల కుటుంబాలను, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కలవాలన్నారు. కూలిపోయిన ఎస్ఎల్బీసీ టన్నెల్, ఫోర్త్ సిటీ, మొదటి ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన అశోక్ నగర్ ను సందర్శించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన వినాశనం గురించి వినడానికి మీకు ‘అద్భుతమైన’ సమయం లభిస్తుందని ఆశిస్తున్నాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.