భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్… రాజస్థాన్ రాయల్స్ (RR) హెడ్ కోచ్ పదవికి వైదొలగారు. అయితే, ఫ్రాంచైజీ భవిష్యత్తుపై కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఐపీఎల్ 2026 వేలానికి కేవలం కొన్ని నెలల ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2011లో ఆటగాడిగా రాయల్స్‌లో చేరిన ద్రావిడ్, 2012–13లో కెప్టెన్‌గా జట్టును నడిపారు. అనంతరం 2014–15లో మెంటార్‌గా సేవలందించారు. ఇటీవల టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన, 2025లో మళ్లీ RR కోచ్‌గా చేరారు.
అయితే, 2025 సీజన్ లో జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే, 2022 తర్వాత అత్యంత చెత్త స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ద్రావిడ్ తన పదవికి రాజీనామా చేశారు.
ఈలోగా రాయల్స్ “స్ట్రక్చరల్ రివ్యూ” చేపట్టినట్టు ప్రకటించి, ద్రావిడ్‌కు విస్తృతమైన కొత్త బాధ్యతలు ఆఫర్ చేసినట్లు వెల్లడించింది. అయితే ద్రావిడ్ వాటిని అంగీకరించకుండా, పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
సంజు శాంసన్ భవిష్యత్తుపై ఊహాగానాలు..
ద్రావిడ్ విరమణతో పాటు స్కిప్పర్ సంజు శాంసన్ కూడా జట్టును వీడతారా? అన్న ప్రశ్నలు ముసురుకున్నాయి. ఇప్పటికే శాంసన్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు మీడియాలో రావడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
రాయల్స్ అధికారిక ప్రకటన..
“రాహుల్ రాయల్స్ ప్రయాణంలో ఎన్నో ఏళ్లుగా కీలక భాగస్వామి. ఆయన నాయకత్వం అనేక తరాల ఆటగాళ్లను ప్రభావితం చేసింది. జట్టులో విలువలను నాటారు. క్లబ్ సంస్కృతిపై చెరగని ముద్ర వేశారు. స్ట్రక్చరల్ రివ్యూ అనంతరం ఆయనకు విస్తృతమైన బాధ్యతలు ఆఫర్ చేసినా, వాటిని ఆయన స్వీకరించలేదు. ఫ్రాంచైజీకి ఆయన చేసిన అద్భుతమైన సేవకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.” అని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తెలిపింది.