ADB | రెవెన్యూ భూమిలో క్వారీ తవ్వకాలు.. రూ.కోటి వరకు రాయల్టీ హాంఫట్

జన్నారం, జులై 9 (ఆంధ్రప్రభ): రెవెన్యూ భూముల్లో (Revenue Land) అక్రమంగా క్వారీ నడుపుతూ ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.కోట్ల రాయల్టీని ఎగ్గొడుతూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. మైనింగ్ అధికారులకు ఈ వ్యవహారం తెలిసినప్పటికీ చూసి చూడనట్లు, తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి.

మంచిర్యాల జిల్లా (Manchryala District) జన్నారం మండలంలోని పోనకల్ రెవెన్యూ శివారులోని 17 సర్వే నెంబరులో సుమారు 50ఎకరాల బండ, ఎర్రమట్టితో పెద్ద గుట్టబోరు ఉంది. గత కొన్నేళ్లుగా ఎలాంటి రాయల్టీ కట్టకుండా ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న గుట్ట బండను, ఎర్రమట్టిని కొందరు అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. తాజాగా గ్రామానికి చెందిన ఓ వడ్డెర వ్యక్తి ఆ గుట్ట తనదేనంటూ యథేచ్ఛగా క్వారీ నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నాడు. పెద్ద గుట్టలోని బండను బ్లాస్టింగ్ మిషన్ (Blasting mission) తో బ్లాస్టింగ్ చేస్తూ గృహాలకు ఉపయోగకరమైన బేస్మెట్ రాయి, బెందడి బండ, కంకరను కొట్టిస్తూ ట్రాక్టర్ల ద్వారా విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు రూ. 1కోటి వరకు రాయల్టీ ఎగవేసినట్లు తెలిసింది.

ఈ వ్యవహారం తెలుసుకొని తాను ఆ గుట్ట బోరు ప్రాంతాన్ని పరిశీలించినట్లు స్థానిక తహసీల్దార్ సి.రాజమనోహర్ రెడ్డి (Rajamanohar Reddy) బుధవారం మధ్యాహ్నం తెలిపారు. అక్కడి నుంచి అక్రమంగా బండరాయిని తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ను, ఇసుకను తరలిస్తున్న మరో ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేసి కేసు చేసి ఆ రెండు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. ప్రభుత్వ రెవెన్యూ భూమిలోని పెద్ద బండరాయితో ఎర్ర మోరం ఉన్న పెద్దగుట్టకు అక్రమంగా క్వారీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా బ్లాస్టింగ్ మిషన్ తో గుట్ట బండలకు బ్లాస్టింగ్ చేస్తే మైనింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

Leave a Reply