అమలులోకి నిషేదాజ్ఞలు…

- వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలను సంపూర్ణంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షపాతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడేందుకు వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఈ నెల 11న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పలు ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా, చట్టం చేతుల్లోకి తీసుకునే సంఘటనలు జరగకుండా పోలీసు విభాగం పూర్తిస్థాయి కట్టడి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
అదే భాగంగా, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధిం అని వివరించారు. ఈ నిషేధాజ్ఞలు 10వ తేదీ ఉదయం 6 గంటల నుండి 11వ తేదీ రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఎవరిపైనా చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.
