ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

గంపలగూడెం, ఆంధ్రప్రభ : భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు,ఆధునిక శిబిచక్రవర్తి,శాంతియుతంగా జరిగిన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల గుండెల్లో గాంధేయవాది, అమరజీవిగా పేరొందిన పొట్టి శ్రీరాములు జయంతి ఈ రోజు. 1876లో తీవ్రమైన కరువు రావడంతో పొట్టి శ్రీరాములు కుటుంబం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి మద్రాసుకు వలస వెళ్లింది. అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారు.

చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో తల్లి పోషించడానికి ఎంతో కష్టపడేది. తిండి కూడా లేని పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు మద్రాసులోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలోనే భోజనం చేసి అక్కడే చదువుకునే పరిస్థితి ఉండేది. ఉన్నత విద్యాభ్యాసం సానిటరీ ఇంజినీరింగ్ ముంబైలో పూర్తిచేసి రైల్వేలో నెలకు రూ.250 జీతంతో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత శ్రీరాములుకి వివాహం అయింది. భార్య, బిడ్డ, తల్లి చనిపోవడంతో పొట్టి శ్రీరాములు అతని ఆస్తులన్నీ సోదరులకు ఇచ్చేసి దేశ సేవ కోసం అంకితం అవ్వాలని నిర్ణయించుకుని 1927లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.

దళితులు దేవాలయ ప్రవేశం కోసం దళిత ఉద్యమం చేసి వారి హక్కుల సాధనకు అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చారు. ఆ దశలో గాంధీజీ ప్రభావం శ్రీరాములుపై చాలా ఎక్కువగా ఉంది.ఆయన గాంధీజీ అనుచరుడుగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. ఆయన పట్టుదల చూసిన గాంధీ శ్రీరాములు లాంటి వారు పదిమంది ఉంటే నేను సంవత్సరంలోనే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధిస్తానని ప్రకటించారు. స్వాతంత్రోద్యమ సమయంలో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం,సత్యాగ్రహంలో కీలకంగా వ్యవహరించారు.ఇక ఉద్యమం సమయంలో మొత్తం మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు.

1934 జనవరి 15న ఉదయం రెండు గంటల సమయంలో బిహార్ ఉత్తర ప్రాంతంలో మూడు సార్లు తీవ్రంగా కంపించి భయంకరమైన శబ్దంతో భూకంపం ముంచెత్తింది. దీని ప్రభావం 77 వేల చదరపు మైళ్లకు వ్యాపించగా ఫలితంగా కోటిన్నరమంది తీవ్ర సమస్యలకు గురయ్యారని అంచనా.పది లక్షల ఇళ్ళు, 1,400 కిలోమీటర్ల రైలు మార్గం ధ్వంసమయ్యాయి. ఐదవ నెల జైలు శిక్ష అనుభవిస్తున్న ఎంతో మందితోపాటు భూకంపం కారణంగా పొట్టి శ్రీరాములు విడుదలై గాంధీజీ సలహా మేరకు బిహార్ భూకంప భాదితుల కేంద్ర సహాయక సంఘంలో సభ్యుడుగా చేరారు.

దీనికి నాయకత్వం వహిస్తున్నది బాబూ రాజేంద్రప్రసాద్. దాదాపు పది నెలలపాటు నిద్రాహారాలు మాని,సహాయ సేవా కార్యక్రమాలను పొట్టి శ్రీరాములు గొప్పగా నిర్వహించారు. 1937లో మేనమామ భార్య తండ్రి అయిన గోనుగుంట్ల నర్సయ్య మరణంతో శ్రీరాములు ప్రజా జీవితం తెలుగు ప్రాంతానికి తరలివచ్చింది. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష ఫలితంగా హరిజనులు ఆలయంలో ప్రవేశింపగలిగారు. ఆ సంవత్సరంలోనే మద్రాసు ప్రభుత్వంచే హరిజనుల ఆలయప్రవేశం, హరిజనోద్ధరణకు సంబంధించిన రెండు శాసనాలను ఆమోదింపచేసేందుకు 23 రోజులు నిరశన దీక్ష చేశారు.ఆయన వజ్ర సంకల్పం ఫలించింది.

గుడివాడ నుండి ఎర్నేని సుబ్రహ్మణ్యం నడిపిన దరిద్ర నారాయణ పత్రికలో పొట్టి శ్రీరాములు స్వతంత్ర రచనలతోపాటు ఆంగ్ల వ్యాసాలకు అనువాదాలు కూడా కనబడతాయి. గాంధీ స్మారక నిధి ఇంకా కాంగ్రెస్ కమిటీ బాధ్యుడిగా భాష తెలియని ప్రభుత్వం కారణంగా ప్రజా కార్యక్రమాలు సరిగా నిర్వహింపబడటం లేదని గుర్తించి స్వభాషారాష్ట్రం కోసం ఆత్మార్పణకు పూనుకొన్న యోధుడు పొట్టి శ్రీరాములు సి.రాజగోపాలాచారి వంటి కొందరు నాయకులు కొంత దూరదృష్టితో, ఉదారబుద్ధితో వ్యవహరించి ఉంటే తెలుగువారు పొట్టి శ్రీరాములును కోల్పోయి ఉండేవారు కాదు.

పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఎంతో కృషి చేశారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 1952 అక్టోబర్ 10 నుండి 58 రోజులపాటు మద్రాస్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు దిగిన 40 రోజుల తర్వాత కేంద్రం దిగివచ్చింది. నీలం సంజీవరెడ్డిని దూతగా పంపి దీక్ష విరమించాలని కోరింది. లక్ష్యం సాధించేవరకు దీక్ష విరమించేది లేదని శ్రీరాములు వారికి తేల్చి చెప్పారు. డిసెంబర్ 15న ఆయన ప్రత్యేక భాషా రాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తనను తాను త్యాగం చేసుకున్న అమరజీవిగానే ఆయన అందరికీ తెలుసు.

నిజానికి పొట్టి శ్రీరాములు ధీరోదాత్త ఆత్మత్యాగం కారణంగా తమిళులు,కన్నడిగులు, మలయాళీలు,గుజరాతీలు, మహారాష్ట్రీయులు ఇలా ఎన్నో మాతృభాషలవారు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పరచుకున్నారు. వారందరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో 6.8 ఎకరాల స్థలం పొట్టి శ్రీరాములు స్మృతివనానికి కేటాయించింది.ఆ స్మృతివనంలో 58 రోజుల దీక్షకు గుర్తుగా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరిట 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయగా 125వ జయంతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా నేడు ఆవిష్కరణ చేయనున్నారు.

Leave a Reply