పులివెందుల: అవును.. మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక దాదాపు ఓ యుద్దాన్నే తలపించింది. కావడానికి జడ్పీటీసీ ఎన్నికే అయినా అటు అధికార టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా తలపడ్డాయి.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికను కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బ్యాలెట్ విధానంలో ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. ఐదు గంటల వరకు క్యూలైన్​లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్​ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లోనూ దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో దాదాపు 10,600 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఆరు పంచాయతీల్లో దాదాపు 15 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నల్లపరెడ్డిపల్లె మేజర్ పంచాయతీలోనే దాదాపు 4,000 కు పైగా ఓటర్లు ఉండటం గమనార్హం. ఈ 15 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. అందుకే అక్కడ వెబ్ కాస్టింగ్‌తోపాటు సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, వృద్ధులు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో బలమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. పోలీసులు, ఎన్నికల సిబ్బంది, పారామిలిటరీ ఫోర్సులు క్రమశిక్షణతో విధులు నిర్వహించారు. ఈ ప్రాంతంలో గత ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండటంతో, రెండు ప్రధాన పార్టీలు కూడా గెలుపుపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.

జడ్పీటీసీ ఎన్నికలు సాధారణంగా పెద్ద ఎత్తున చర్చకు రాకపోయినా, ఈ సారి పులివెందుల, ఒంటిమిట్టలో రాజకీయ పరిస్థితులు ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా పులివెందుల ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన కేంద్రంగా ఉండటం, ఇక్కడి ఫలితాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంకేతాలు ఇస్తాయన్న అంచనాలున్నాయి. ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. రెండు ప్రాంతాల ఓటర్లు ఎవరికి అధిక మెజారిటీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ రోజునే పలుచోట్ల పెద్ద ఎత్తున రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే ఫలితాలు వెలువడే వరకు పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగే అవకాశం ఉంది. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల అనుచరులు విజయాన్ని ఆశిస్తూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply