Penugonda | వాస‌వి మాత‌కు పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించిన చంద్ర‌బాబు

నేడు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్ప‌ణ దినం
పెనుగొండ ఆల‌యంలో ఘ‌నంగా ఉత్స‌వాలు
ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపించిన చంద్ర‌బాబు

పెనుగొండ – ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్ప‌ణ దినం సంద‌ర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మ‌వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అంతకు ముందు స్ధానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప‌ట్ట‌ణంలోని వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి ఆల‌యానికి చేరుకున్న సీఎంకు ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు, అధికారులు, సిబ్బంది పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత‌ చంద్ర‌బాబు అమ్మవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. వేద పండితులు చంద్ర‌బాబు దంప‌తులను ఆశీర్వ‌దించారు.

త‌ర్వాత సమీపంలోని వాసవీధాంను సీఎం సందర్శించారు. 90 అడుగుల వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహానికి ఆయన పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. “ఆ తల్లి రాష్ట్రాన్ని చల్లగా చూడాలని కోరుకున్నాను. గొప్ప చరిత్ర ఉన్న పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషకరం. ప్రభుత్వం తరపున మొదటిసారి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతం. స్త్రీల ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పిన పార్వతీదేవి అంశతో పుట్టిన అమ్మవారు వాసవీ మాత. అహింస, ఆత్మగౌరవానికి ఈ అమ్మవారు ప్రతిరూపం. వాసవిని కొలిస్తే శాంతి, సంపద, రక్షణ నిండుగా లభిస్తాయని అన్నారు.

సమాజం పట్ల అత్యంత బాధ్యతగల వ్యక్తులు ఆర్యవైశ్యులు అని ప్ర‌శంసించారు చంద్ర‌బాబు. బెంగళూరులో ఉన్నవారు ఇక్కడ ఆలయాలు నిర్మించారంటే అది అమ్మవారి మహిమ అని పేర్కొన్నారు.. రానున్న రోజుల్లో పెనుగొండ ఒక క్షేత్రంగా రూపొందుతుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆర్యవైశ్యులు నీతి నిజాయితీతో కష్టపడి పని చేస్తారని. సంపాదించిన దాంట్లో ప్రజాసేవకు కొంత ఖర్చు చేస్తారని పేర్కొన్నారు.. ఒకప్పుడు కిరాణా దుకాణాలకు పరిమితమైన వారు.. ఇప్పుడు పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తున్నార‌న్నారు. . కార్పొరేషన్ ద్వారా ఆర్యవైశ్యుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు ముఖ్య‌మంత్రి. స్వర్ణాంధ్ర-2047 ప్రకారం ముందుకు వెళ్తున్నామ‌ని, ఇందులో ఆర్యవైశ్యులు ప్రధాన పాత్ర పోషించాలి” అని చంద్రబాబు వారిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *