ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈరోజు పంజాబ్ – చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు తీవ్రంగా పోరాడిన చెన్నై.. 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా, తమ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడిన పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో శ్రేయాస్ అయ్యన్ నేతృత్వంలోని పంజాబ్ తిరిగి విజయ ట్రాక్‌లోకి వచ్చింది.
ఈ మ్యాచ్ లో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయింది. పంజాబ్ బౌలర్లు కట్టడి చేయడంతో.. చెన్నై జట్టు 201/5కే పరిమితమైంది.
పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. యష్ రవిసింగ్ ఠాకూర్, గ్లెన్ మాక్స్ వెల్ ఒక్కో వికెట్ తీశారు. చెన్నై బ్యాటర్లలో డివాన్ కాన్వే (69 రిటైర్డ్ ఔట్) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. రచిన్ రవీంద్ర (36), శివం దూబే (42) రాణించారు.
ఇక ఐదో వికెట్ గా వచ్చిన ధోని (27) సిక్సుల మోత మోగించాడు. ఈ క్రమంలో మ్యాచ్ సీఎస్కే కి అనుకూలంగా మారింది. అయితే 19.1 ఓవర్లో ధోని క్యాచ్ ఔటయ్యాడు. దీంతో గెలుపు అంచుల వరకు వచ్చిన చెన్నై.. 18 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. జడేజా (9 నాటౌట్) పరుగులు సాధించాడు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలచిన తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 219 సాధించింది. కీలక బ్యాటర్లు విఫలమైనా.. క్రీజులో పాతుకుపోయిన ప్రియాంష్ ఆర్య… (42 బంతుల్లో 103) శతక్కొట్టాడు. శశాంక్ సింగ్ ( 36 బంతుల్లో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక మార్కో జాన్సన్ (19 బంతుల్లో 34) దంచికొట్టాడు. వీరు మినహా మరే ప్లేయర్ డబుల్ డిజిట్ స్కోర్ సాధించలేదు.
సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేష్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో 5వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకున్నారు. సీఎస్కే 9వ స్థానంలోనే కొనసాగుతోంది.