పాత శివాలయం హుండీ లెక్కింపు…

పాత శివాలయం హుండీ లెక్కింపు…
రూ.5.20 లక్షల ఆదాయం
106 రోజుల్లో 31 హుండీల నుంచి భక్తుల కానుకలు…
అధికారుల పర్యవేక్షణలో పారదర్శక లెక్కింపు
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ వన్‌టౌన్ రథం సెంటర్‌లోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో 27 సాధారణ హుండీలు, 4 తాత్కాలిక హుండీలు కలిపి మొత్తం 31 హుండీలు తెరిచి లెక్కించగా రూ.5,20,137 ఆదాయం నమోదైంది. ఈ మొత్తము 09-12-2025 నుంచి 24-03-2026 వరకు 106 రోజుల కాలానికి సంబంధించినదిగా అధికారులు తెలిపారు. లెక్కించిన మొత్తాన్ని వెంటనే బ్యాంకులో జమ చేశారు.
ఈ లెక్కింపులో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు లభించలేదు. దేవదాయ ధర్మదాయ శాఖ నియమించిన పర్యవేక్షణాధికారి కె. నాగరాజు ఆధ్వర్యంలో, జి.కొండూరు గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో సిబ్బంది, అర్చకులు, భక్తులు, దుర్గ శివ సాయి సేవ సంఘం సభ్యులు, కెనరా బ్యాంకు అధికారులు, స్థానిక ప్రముఖుల సమక్షంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు.
ఇక సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలంపాటలకు ఎవరూ హాజరు కాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయ అధికారి, కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
