హైదరాబాద్: తెలంగాణ అప్పు రూ.8.6 లక్షల కోట్లుగా ఉందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రోజుకు రూ.1700 కోట్లకు పైగా కాంగ్రెస్ సర్కార్ అప్పు చేస్తోందని విమర్శించారు.
బడ్జెట్ పై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “నిమిషానికి రూ.కోటికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ.2.27లక్షలుగా ఉంది. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయి. యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 32శాతం వాటా ఉండేది. అప్పుడు కేంద్ర పన్నుల్లో వాటా 2-3 శాతం కూడా పెంచలేదు. మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా 10శాతం పెంచి 42 శాతం చేశారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదు” అని ఆయన అన్నారు. అప్పుల్లో ప్రభుత్వం ఎంతో కాలం నడవదనే విషయాన్ని రేవంత్ గుర్తించాలని మహేశ్వరరెడ్డి కోరారు.