ఆయిల్‌పామ్ రైతుకు ‘ధర’హాసం.. రికార్డు స్థాయికి గెలల ధర

ఆయిల్‌పామ్ రైతుకు ‘ధర’హాసం.. రికార్డు స్థాయికి గెలల ధర
దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఆయిల్‌పామ్ సాగుదారుల ఇంట కాసుల పంట పండుతోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ముడి పామాయిల్ ధరలను బేరీజు వేస్తూ తెలంగాణ ఆయిల్ ఫెడ్ తీసుకున్న తాజా నిర్ణయంతో గెలల ధర మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి నెలలో టన్ను ధర రూ. 21,546 ఉండగా, మార్చి నెలలో ఏకంగా రూ. 1,459 పెంచుతూ రూ. 23,005గా ఆయిల్ ఫెడ్ ఖరారు చేసింది. సంస్థ చరిత్రలో టన్ను ధర 23 వేల మార్కును దాటడం ఇదే తొలిసారి కావడంతో సాగుదారుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ, ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ఆయిల్ ఫెడ్ ఈ మేర నిర్ణయం తీసుకుంది. రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా మంత్రి తుమ్మల నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, ఆయిల్ ఫెడ్ ద్వారా మెరుగైన ధర లభించేలా చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం సాగుదారులపై పడకుండా సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును భారీగా విస్తరించి, రైతులను ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలపాలన్న మంత్రి సంకల్పం ఈ ధరల పెరుగుదలతో మరోసారి స్పష్టమైంది.
ఆయిల్ ఫెడ్ ప్రకటించిన ఈ భారీ ఊరటపై రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో సాగుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చొరవ చూపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పలుచోట్ల రైతులు మంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ సంతోషాన్ని చాటుకున్నారు. తాము కోరకముందే రికార్డు స్థాయిలో ధర పెరిగేలా కృషి చేసి తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన మంత్రికి ఎప్పటికీ ఋణపడి ఉంటామని వారు భావోద్వేగంతో చెబుతున్నారు.
ఈ ధరల పెంపుతో రానున్న రోజుల్లో మరింత మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
