విశాఖపట్నం – వైజాగ్ మేయర్ ప్రై కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాసం తీర్మానం లో కూటమి విజయం సాధించింది.. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో శనివారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కూటమికి చెందిన 74 మంది సభ్యులు హాజరయ్యారు.. వైసిపి సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. కాగా అవిశ్వాస తీర్మానం గెలవాలంటే 74 మంది సభ్యులు అవసరం కాగా, ఆ బలం కూటమికి ఉండటంతో ఈ తీర్మానంలో కూటమి విజయం సాధించింది.. దీంతో ప్రస్తుతం మేయర్ హరివెంకటకుమారి పదవిని పొగొట్టుకున్నారు..
అవిశ్వాస పరీక్ష ఇలా జరిగింది.
అవిశ్వాస తీర్మాన పరీక్షకు విశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. విశాఖ ఇన్‌ఛార్జి కమిషనర్, కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలోకి ఇతరులను అనుమతించలేదు. కార్పొర్టేర్లు హాల్‌లోకి రాగానే ఫోన్లు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 11 గంటలకు హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ జరిగింది. విశ్వాస పరీక్షకు ఏర్పాట్లను ముందు నుంచీ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి హరేంధిరప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షించారు. అవిశ్వాస తీర్మాన పరీక్ష నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు భద్రత కల్పించారు. పోలీసు కమిషనర్ శంఖ బత్ర బాగ్చి భద్రతా ఏర్పాట్లు చేశారు. పాస్ చూసి జీవీఎంసీ లోపలికి అనుమతించారు. జీవీఎంసీ సిబ్బందిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా, 21వ డివిజన్ కార్పొరేటర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యులు 16 మంది ఉండగా, 11 మంది కూటమి వైపే ఉన్నారు. వైసీపీకి నలుగురి బలం ఉంది. కార్పొరేటర్లు జనసేనకు 14 , బీజేపీకి ఇద్దరు, టీడీపీకి 48 మంది కలిసి మొత్తం 75 మంది వరకు సంఖ్యాబలం ఉండగా, సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు.
ఇక శిబిరాలకు స్వస్తి
మేయర్ పీఠంపై వారాల తరబడిహైటెన్షన్ కొనసాగింది. వైసీపీ, కూటమి నేతలు నువ్వా నేనా అన్నట్టు వ్యూహాలు రచించారు. అమలు చేశారు. ఈ పోటాపోటీ క్యాంపులతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇటు వైసీపీ, అటు కూటమి పెద్దలు తమ సభ్యులను విదేశాలకు తరలించారు. సంఖ్యాబలం బొటాబొటిగా ఉండటంతో ఎప్పుడు ఎవరు గోడ దూకుతారో అనే టెన్షన్ అన్నిపార్టీల్లో కంగారు పెట్టింది. తీరా అవిశ్వాస తీర్మానం సమాయానికి కూటమి పైచేయి సాధించింది. 74 మంది సభ్యుల ఓటింగ్‌తో.. మేయర్ సీటు నుంచి వైసీపీని తొలగించింది. ఇన్నాళ్లు మలేషియాలో ఉన్న కూటమి కార్పొరేటర్లు తీర్మానానికి ముందే విశాఖకు చేరుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లు మాత్రం కేరళ, శ్రీలంకలోనే ఉండిపోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు 74 మంది సభ్యుల మద్దతు అవసరం. వైసీపీకి 30 మంది కార్పొరేటర్ల మద్దతు మాత్రమే ఉంది. వైసీపీ నుంచి మరో ఇద్దరిని తీసుకొచ్చేందుకు కూటమి ప్రయత్నించింది. తమ కార్పొరేటర్లను టీడీపీ నేతలు బెదిరించారంటూ.. వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. కేరళలో తమ కార్పొరేటర్లు ఉన్న రిసార్ట్‌కు అర్ధరాత్రి టీడీపీ నేతలు వచ్చారంటూ.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వీడియో విడుదల చేశారు. వైసీపీ విడుదల చేసిన వీడియోలో ఏపీ మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, వీఆర్డీయే చైర్మన్ కనిపించారు. ఎంత ప్రయత్నం చేసినా విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ కాపాడుకోలేక పోయింది. అవిశ్వాస తీర్మానంపై కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి.
టీడీపీ గూటికి చేరిన వైసీపీ కౌన్సిలర్లు..
నాలుగేళ్ల కిందట జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 58 వార్డులను గెలుచుకుంది. దీంతో 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరి వెంకట కుమారి మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఇండిపెండెంట్‌లుగా గెలిచిన నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఒక్కరు కూడా వైసీపీలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్పొరేటర్లలో చాలా మంది టీడీపీ, జనసేన గూటికి చేరిపోయారు. 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో, 9 మంది జనసేనలోకి వెళ్లారు. అలాగే ఇండిపెండెంట్‌లు కూడా టీడీపీ, జనసేన పార్టీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ 58 మంది కార్పొరేటర్ల సంతకాలు చేసి గత నెల 21న జీవీఎంసీ ఇన్‌చార్జ్, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. సంతకాల ధృవీకరణ కూడా జరిగిపోయింది. ఇక అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ కార్పొరేట్లరు .. అవిశ్వాస తీర్మానం విజయం తథ్యమని భావించి.. ముందస్తుగా కౌన్సిల్ భేటీకి బహిష్కరించారు.