కర్నూలు బస్సు దగ్ధం దర్యాప్తులో.. కొత్త మలుపు
పోలీసుల అదుపులో బైకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి
విభిన్న సాక్ష్య కథనాలతో పోలీసులు ఉక్కిరి బిక్కిరి
తెరమీదకు అనుమానాలెన్నో..
(కర్నూలు , ఆంధ్రప్రభ బ్యూరో) : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ఎర్రి స్వామి (Erri Swami) పేరు.. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మార్మోగుతోంది. బెంగళూరు -హైదరాబాద్ నేషనల్ హైవేపై కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ మిత్రుడే ఎర్రి స్వామి. ఇద్దరూ కలిసి ప్రయాణిస్తుండగా, ప్రమాదం అనంతరం ఎర్రి స్వామి అదృశ్యమయ్యాడు. ఇక్కడే మరో సస్సెన్స్ ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. పెట్రోల్ బంక్ లో శివశంకర్ తో కనిపించి అదృశ్యమైన ఎర్రి స్వామి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాయి.
ప్రమాదానికి కొద్దిసేపటి ముందే ఎర్రి స్వామి డోన్ వైపు బైక్‌పై వెళ్తూ చిన్నటేకూరు సమీపంలోని ఒక పెట్రోల్ బంక్ (Petrol station) వద్ద ఆగాడు. పెట్రోల్ వేయించుకునే ప్రయత్నం చేసినా, అక్కడి సిబ్బంది స్పందించకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. కొద్ది నిమిషాలకే ప్రమాద ఘటన చోటుచేసుకోవడం, అదే సమయంలో శివశంకర్ మృతి చెందడం,ఈ పరిణామాలన్నీ ఒకదానికొకటి అనుసంధానమవుతున్నాయి.

ఎర్రి స్వామి ఎక్కడ ?
ప్రమాదం జరిగిన సమయంలో ఎర్రి స్వామి శివశంకర్ (Sivashankar) బైక్ వెనక కూర్చుని ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కానీ ప్రమాదం తర్వాత అతను అక్కడి నుంచి కనిపించకుండా పోవడం ప్రశ్నార్థకంగా మారింది. బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన చూసి భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీడియో ఆధారాలు వెలుగులోకి రావడంతో, ఎర్రి స్వామి ప్రమాదంలో గాయపడినట్లు స్పష్టమవుతోంది. ఘటన అనంతరం తన స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లికి వెళ్లి, స్థానికంగా చికిత్స పొందినట్లు సమాచారం. పోలీసులు అతనిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు.
వీడియోతో కేసు దిశే మారింది…
ప్రమాదం తర్వాత వెలుగులోకి వచ్చిన వీడియో (Video)తో విచారణ దిశే మారిపోయింది. బైక్‌పై ఇద్దరూ కలిసి వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉండటంతో, ఎర్రి స్వామి పాత్రపై మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం పోలీసులు అతనితో జరిగిన మొత్తం ప్రయాణాన్ని రీక్రియేట్ చేస్తూ, ప్రమాదానికి దారితీసిన పరిణామాలను సేకరిస్తున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఎర్రి స్వామి విచారణ అనంతరం ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బస్సు దగ్ధానికి ముందు బైక్ ఏ దిశలో వెళ్ళింది?, బస్సును ఢీ కొందా.. వేరే కారణమా అన్నది ఈ విచారణలో తేలనుంది.
ఎర్రిస్వామి రెండు కథలు…
ఈ కేసులో ఎర్రి స్వామి పాత్ర కీలకం అవుతోంది. అతను బతికి ఉన్నందున ప్రమాదానికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై పూర్తి వివరాలు చెప్పగల ఏకైక వ్యక్తి. కానీ ఘటన తర్వాత పారిపోవడం, గాయాల్ని దాచిపెట్టడం, స్వగ్రామంలో చికిత్స పొందడం .. ఇవన్నీ కలిపి మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పోలీసులు (police) అతని వాంగ్మూలంతో ప్రమాదం వెనుక నిజమైన కారణం వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.


