NARA | కుప్పంలో నీటి కరువు లేకుండా చేస్తాం..

  • అదే సీఎం చంద్రబాబు లక్ష్యం
  • కుప్పానికి రూ. 23,000 కోట్లతో ఏడు పరిశ్రమలు చంద్రబాబు తీసుకువచ్చారు
  • జలహారతి కార్యక్రమం లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం
  • మూడవ రోజు పర్యటనలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి

NARA | కుప్పం, నవంబర్ 21(ఆంధ్రప్రభ ): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మూడవ రోజు ఉదయం శాంతిపురం మండలం శివపురం గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలతో వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అందించేలా చూస్తానని భువనమ్మ హామీ ఇచ్చారు. అనంతరం మండల పరిధిలో ని తుమ్మిసి పెద్ద చెరువు లో జరిగిన జలహారతి కార్యక్రమం లో నారాభువనేశ్వరి పాల్గొన్నారు.

ఆమె మాట్లాడుతూ జల హారతి కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం అని నారా భువనేశ్వరి అన్నారు.అదేవిధంగా తాగు,సాగు నీటికి ఇబ్బంది లేకుండా కృష్ణ జలాలను కుప్పం తీసుకొచ్చిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని తెలిపారు.కుప్పంలో నీటి కరువు అనేది లేకుండా చూడటమే చంద్రబాబు లక్ష్యం అని కుప్పం తో పాటు రాష్ట్రంలో ఉన్న రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

కుప్పానికి రూ. 23,000 కోట్లతో 7 పరిశ్రమలు తీసుకురావటం జరిగిందని, ఏడు పరిశ్రమలలో మూడు పరిశ్రమలు కేవలం మహిళల అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు కు కుప్పం ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పరిశ్రమలతో పాటు టూరిజం డెవలప్మెంట్ కూడా కుప్పంలో జరుగుతుందని ఆమె తెలిపారు.

Leave a Reply