Nandyala | కోటిదీపోత్సవం వేడుకలు..
Nandyala, ఆంధ్రప్రభ – నంద్యాల (Nandyala) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకుని నేడు శుక్రవారం దేవస్థానం కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందని కార్యనిర్వాహణా అధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. కోటి దీపోత్సవ కార్యక్రమం ఈ ఏడాది మొట్టమొదటిసారిగా నిర్వహించడం విశేషం. కోటిదీపోత్సవ నిర్వహణకు గాను గంగాధర మండపం వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా. దీవి హయాగ్రీవాచార్యుల వారు కోటిదీపోత్సవ విశేషాలు తెలియచేస్తారన్నారు.
అనంతరం ప్రఖ్యాత నాట్య కళాకారిణి కుమారి లిక్షితాశ్రీ బృందంచే సంప్రదాయ నృత ప్రదర్శన, ఆతర్వాత కోటిదీపోత్సవ వేదిక పై శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలు, కోటిదీపోత్సవం జరిపించబడుతుంది అన్నారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు దశహారతులుగా ఓంకార హారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పించబడుతాయన్నారు. దశవిధ హారతుల తర్వాత పద్మశ్రీ పురస్కార గ్రహీత – మహాకవి – బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మ వారిచే శ్రీశైలక్షేత్రం కోటిదీపోత్సవం (Koti Deepothsavam) అనే అంశం పై దివ్య ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది అన్నారు.
చివరగా మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనంతో కోటిదీపోత్సవ కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు కోటిదీపోత్సవ ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు ఉండాలని ముఖ్య భద్రతాధికారిని ఆదేశించారు. భద్రతా విషయమై పోలీసు శాఖ వారి పూర్తి సహాయ సహకారాలు పొందాలని ఆదేశించారు. అదే విధంగా భక్తులకు బిస్కెట్లు, మంచి నీటిని అందజేస్తుండాలని అన్నప్రసాదవితరణ విభాగాన్ని ఆదేశించారు. భక్తులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా తగు ప్రదేశాలలో ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

