Nalgonda | ఏఎస్‌పీ మౌనిక రెస్క్యూ ఆపరేషన్ – 30 మందికి వెట్టి నుంచి విముక్తి

న‌ల్ల‌గొండ ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ :ఉత్త‌ర‌భార‌త్ దేశం నుంచి ఉపాధి నిమిత్తం వ‌స్తున్న వ‌ల‌స కూలీల‌తో వెట్టిచాకిరీ చేయిస్తున్నార‌న్న స‌మాచారంతో దేవ‌ర‌కొండ ఏఎస్‌పీ మౌనిక రంగంలోకి దిగారు. దీంతో ఆమెకు అందిన స‌మాచారం నిజ‌మ‌ని తేలింది. సుమారు 30 మంది వ‌ల‌స కార్మికుల‌ను వెట్టిచాకిరి నుంచి విముక్తి క‌ల్పించి దేవ‌ర‌కొండ ప‌ట్ట‌ణంలోని టీటీడీ క‌ల్యాణ‌మండ‌పంలో ఆశ్ర‌యం క‌ల్పించారు. వారి సంర‌క్ష‌ణ బాధ్య‌త చైల్డ్ వెల్ఫేర్‌, కార్మిక శాఖకు అప్ప‌గించారు.

వారి నుంచి వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ప్ర‌స్తుతానికి వివ‌రాల‌న్నీ గోప్యంగా ఉంచారు. ప్ర‌ధాన నిందితులు దొరికిన త‌ర్వాత పోలీసులు పూర్తి వివ‌రాలు ఇవ్వ‌నున్నారు. అలా వ‌చ్చారు.. ఇలా చిక్కుకున్నారు..నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీ వాసులు చేపల వేటతో జీవ‌నం సాగిస్తున్నారు. వైజాగ్ నుండి వలస వచ్చిన వందలాదిమంది ఇక్కడ నివాసం ఏర్పరచుకొని నాగార్జున సాగ‌ర్ బ్యాక్ వాట‌ర్ లో చేప‌లు ప‌డుతున్నారు. ఇక్కడ పట్టిన చేపలను కోల్‌క‌త్తాకు ఎగుమతి చేసి వ‌చ్చిన ఆదాయంతో ఉపాధి పొందుతున్నారు. కొంత రిస్క్ ఉండ‌డంతో ఉత్త‌ర భార‌త‌దేశం నుంచి వ‌ల‌స వ‌చ్చిన వారికి గేలం వేసి చేప‌లు ప‌ట్టే ప‌నిలో దించుతున్నారు.

ఈ క్రమంలో వైజాగ్ కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తులు బడా కాంట్రాక్టర్ల సహాయంతో విజయవాడ, హైదరాబాద్ లాంటి నగరాలకు జీవనోపాధి కోసం వలస వచ్చే బీహార్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని చెప్పి సంవత్సరం కిందట ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని సమాచారం. అయితే వారి చేత చేప‌లు ప‌ట్టే ప‌నులు చేయిస్తున్నారు. వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్న కాంట్రాక్ట‌ర్లు.

జీవనోపాధి కోసం వచ్చిన వలస కూలీలతో కాంట్రాక్టర్లు సాగర్ నడిబొడ్డున ఉన్న ద్వీపాల లాంటి ప్రాంతాలలో షెల్టర్ కల్పించి వారిని జనావాసాలలోకి రాకుండా, చేసిన కష్టానికి వేతనాలు చెల్లించకుండా నిర్బంధంగా పనులు చేయించుకుంటున్నట్లు సమాచారం. ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై చేయి చేసుకునేవారని తెలుస్తోంది. వారికి కాంట్రాక్టర్లు కేవలం బియ్యం కూరగాయలు మాత్రమే అందించే వారని తెలుస్తోంది.

పోవడానికి చార్జీలు కూడా లేకపోవడం, చుట్టూ కృష్ణా నది నీరు ఉండ‌డంతో దారితెన్ను తెలియ‌క వెట్టిచాకిరీ చేస్తున్నారు. ఆప‌రేష‌న్ దేవ‌ర‌కొండ‌…దేవ‌ర‌కొండ ఏఎస్‌పీ మౌనిక ఆదేశాల మేర‌కు దేవ‌ర‌కొండ డివిజ‌న్ పోలీసులు ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. తొలుత పీఏ పల్లి, డిండి, చందంపేట, నేరేడుగొమ్మ గ్రామాల్లో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి కొంత స‌మాచారాన్ని సేక‌రించారు. అనంత‌రం వెట్టిచాకిరీ చేసే వారి ఆచూకీ తెలుసుకున్నారు. సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. దీంతో అక్క‌డ ఉన్న 30 మంది కూలీల‌ను కాపాడి బ‌య‌ట‌కు తెచ్చి దేవ‌ర‌కొండ త‌ర‌లించారు.

ర‌హ‌స్య ద‌ర్యాప్తు…

వెట్టిచాకిరీ నుంచి విడిపించిన వ‌ల‌స కూలీల‌ను దేవ‌ర‌కొండ టీటీడీ క‌ల్యాణ మండ‌పంలో ఉంచి చైల్డ్ వెల్ఫేర్‌, కార్మిక శాఖ‌కు అప్ప‌గించారు. వారికి భోజ‌న సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు. ఇంకా ఎంత మంది వెట్టి చాకిరీ చేయిస్తున్నారు? కాంట్రాక్ట‌ర్ ఎవ‌రు? వీళ్ల‌కు బియ్యం, కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తుంది ఎవ‌రు? అనే విష‌యాల‌పై పోలీసులు ర‌హ‌స్య ద‌ర్యాప్తు చేస్తున్నారు. వెట్టి చాకిరీ చేస్తున్న వారిని ఎవ‌రూ క‌ల‌వ‌కుండా పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. రెండు మూడు రోజుల్లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply