ADB | అద్భుత విన్యాసాలతో అలరించిన నాగోబా జాతర
- బేతాల్, మండగాజలి పూజలతో ఆదివాసుల అలరింపు
- బుడుందేవ్ జాతరకు బయలుదేరిన మెస్రం వంశస్థులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఆదివాసుల ఇలవేల్పు నాగోబా అనుగ్రహానికి భక్తులు పోటీపడ్డారు. కేస్లాపూర్లో భక్తులు పరవశించిపోయారు. జాతరలో నాలుగో రోజు శనివారం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాదిమంది నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి తరించారు. తీరొక్క పూజలతో మొక్కులు చెల్లించుకుంటున్న గిరిజనులు జాతరలో అనాదిగా వస్తున్న ఆచారాల మేరకు శనివారం అద్భుత విన్యాసాలు, సంప్రదాయ పూజలు నిర్వహించి అందరిని అలరించారు.
బేతాల్ విన్యాసాలు అదరహో..!
కఠిన నియమాలు, దీక్షలతో నిర్వహించే మెశ్రo వంశస్థుల పూజల్లో చివరి సంప్రదాయ వీడ్కోలు పూజల ఘట్టం నాగోబా సన్నిధిలో విశిష్టతను చాటుకుంది. తమ ఆరాధ్య దైవం నాగోబా తమ పూజలకు అనుగ్రహించిందని ప్రగాఢంగా నమ్ముతూ వీడ్కోలు పూజలతో ముందుకు సాగారు. శనివారం బేతాల్, మండ గాజలి పూజలు అద్భుతమైన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం మెస్రం ఆడపడుచులు గోవాడ ప్రాంతoలో కుల పెద్దలు పటేల్ వెంకట్ రావ్ కు పాద నమస్కారం చేయగా బేతాల్ పూజకు ఆహ్వానించారు. సంప్రదాయ వాయిద్యాలతో తమ జాతి వంశ పెద్దలను గౌరవిస్తూ బేతాల్ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి ఆడపడుచులు, పురుషులు వేర్వేరుగా శ్వేత వస్త్రధారణతో కర్ర సాముతో గంతులు వేస్తూ బేతాల్ నృత్యా లతో అలరించారు. తమ జాతర ఘట్టం ఫలించిందని వారు ఉప్పొంగిన సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు.

మండ గాజలీక్ పూజలతో ముగింపు
అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో భక్తులు సమర్పించిన పేలాలు, కొబ్బరికాయలు ఒక చోటికి పేర్చి వాటిని మెస్రం వంశీయులకు అందజేశారు. పూజలకు ఉపయోగించిన మట్టి కుండలను మెస్రం ఆడపడుచులకు అందజేసి తమ సంప్రదాయ విశిష్టతను చాటుకున్నారు. అనంతరం నాగోబా జాతర పూజలకు వీడ్కోలు పలికారు.
బుడుందేవత మూర్తుల దర్శనం కోసం గిరిజనుల పయనం…!
ఉట్నూర్ మండలం శ్యాంపూర్ లో కొలువైన బుడందేవేత మూర్తులకు పూజలు చేసేందుకు నాగోబా సన్నిధి నుండి మెస్రం వంశస్థులు పయనమయ్యారు. మార్గ మధ్యలో ఇందరవెల్లి హార్కపుర్ వద్ద ఈరోజు బస చేసి ఆదివారం తెల్లవారుజామున శాంపుర్ లో ప్రత్యేక పూజలతో జాతర ఉత్సవాలు ప్రారంభించనున్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను ఏమాత్రం మరవకుండా ఆదివాసులు జాతర ఉత్సవాలు జరుపుకోవడం ప్రత్యేక విశిష్టతను చాటుకుంది.