Nagarkurnool | సర్పంచ్ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం..

  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సంఘటన

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : సర్పంచ్‌ పదవి తనకు కేటాయించాలని కోరుతూ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త వరుసు బంగారయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద చోటుచేసుకుంది.

శ్రీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బంగారయ్య, సర్పంచ్ స్థానం తన భార్యకు ఇవ్వాలని కోరుతూ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని కలిశాడు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే, “ఒక గంట తర్వాత మళ్లీ మాట్లాడదాం, మీరు ప్యానెల్ సిద్ధం చేసుకోండి. గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం.

ఎమ్మెల్యే వెళ్లిన కొద్దిసేపటికే, ఆందోళన చెందుతున్న బంగారయ్య ఆకస్మికంగా తన జేబులో ఉన్న పురుగుల మందు సీసా తీసి తాగాడు. వెంటనే పక్కనే ఉన్న మిత్రులు సీసాను లాగి తీసి అతడిని అడ్డుకున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

తరువాత బంగారయ్యను నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాగిన మందును వైద్యులు బయటికి తీయగా, ప్రస్తుతం ప్రాణాపాయం లేనట్లు వైద్యులు వెల్లడించారు.

30 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న బంగారయ్య, సర్పంచ్ పదవి తనకే రావాలని ఆశతో ఈ అతివాద చర్యకు పాల్పడ్డాడని అతని మిత్రులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Leave a Reply