హత్యకు గురైన గిరిజనుడు కురిసెంగ అర్జున్

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్‌గూడ పంచాయతీ పరిధిలోని కాలేజీగూడ (రాంనగర్)లో పవర్‌గూడకు చెందిన కురిసెంగ అర్జున్ (40) హత్యకు గురయ్యాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్జున్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వంట కట్టెలు అమ్ముకుంటూ జీవించేవాడని, ప్రతిరోజూ రాత్రి కాలేజీగూడకు వచ్చి నాటు సారా తాగేవాడని తెలిపారు.

ఆదివారం రాత్రి కాలేజీగూడలో ఒక వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో అర్జున్ హత్యకు గురయ్యాడు. సోమవారం ఉదయం అక్కడి కాలనీవాసులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న జైనూర్ సీఐ రమేష్ పోలీసులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అర్జున్ తలపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సంఘటన స్థలాన్ని పవర్‌గూడ సర్పంచ్ తొడసం రాజేందర్‌తో పాటు పలువురు గ్రామస్థులు సందర్శించి పరిశీలించారు. అర్జున్‌ను ఎవరు, ఏ కారణంతో హత్య చేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కూలి పని చేసుకునే అర్జున్‌ను ఎందుకు హత్య చేశారన్న కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply