బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం…

బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం…
- హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు, భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలు చిరస్మరణీయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కొనియాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో, ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని, బడుగు వర్గాల హక్కుల సాధనలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
