చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు…

చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు…
3 కొత్త అసెంబ్లీలు, మరో లోక్సభ స్థానం ఏర్పాటు
మారనున్న అసెంబ్లీ నియోజకవర్గ రిజర్వేషన్లు
పరిధి తగ్గనున్న చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం
కొత్తగా మహిళా రిజర్వేషన్లు అమలు
మారనున్న చిత్తూరు పార్లమెంటు రిజర్వేషన్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపు తిరగబోతోంది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఈ మార్పులతో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 7 నుంచి 10 లేదా 11కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు తోడు మరో కొత్త లోక్సభ నియోజకవర్గం ఏర్పడే అవకాశమూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లాలో కొత్తగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
పాకాల, పుత్తూరు, బంగారుపాలెం నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడవచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గం ఉండగా కొత్తగా మరో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏర్పాటు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం రిజర్వేషన్ కూడా మారవచ్చని భావిస్తున్నారు. కొన్ని స్థానాలు మహిళలకు రిజర్వు కాలు ఉన్నాయి. మొత్తం మీద రానున్న సాధారణ ఎన్నికలకు జిల్లాలో భారీగా రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలు పూర్తిగా జిల్లాలో ఉండగా, నగరి, పుంగనూరు నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. పునర్విభజన తర్వాత ఈ సమీకరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా చిత్తూరు పార్లమెంట్ పరిధిలో కొత్త అసెంబ్లీ స్థానాల పెరుగుదలతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. రాజకీయ వర్గాల అంచనాల ప్రకారం జిల్లాలో మూడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు అవతరించనున్నాయి.
బంగారుపాళ్యం, పాకాల, పుత్తూరు అనే మూడు కొత్త నియోజకవర్గాలు రూపుదిద్దుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. బంగారుపాళ్యం నియోజకవర్గంలో గుడిపాల, బంగారుపాళ్యం, తవణంపల్లె, యాదమరి మండలాలు ఉండే అవకాశం ఉంది. పాకాల నియోజకవర్గంలో పులిచెర్ల, రొంపిచెర్ల, పాకాల, పెనుమూరు మండలాలు చేరేలా ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం. ఇక 2009లో రద్దయిన పుత్తూరు నియోజకవర్గం మళ్లీ పునరుద్ధరించబడే అవకాశముంది.
ఇందులో పుత్తూరు, వడమాలపేట, కార్వేటినగరం మండలాలకు మరొక మండలం జత చేసే అవకాశముందని తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు కీలకంగా మారాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపకుండా చిత్తూరులోనే ఉంచడం, అలాగే నగరి నియోజకవర్గంలోని మండలాలను తిరుపతిలో విలీనం చేయకుండా కొనసాగించడం అన్నీ ముందుగానే పునర్వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలుగా విశ్లేషిస్తున్నారు.
చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపినప్పటికీ, భవిష్యత్తులో పాకాల నియోజకవర్గం రూపుదిద్దుకుంటే అది మళ్లీ చిత్తూరు జిల్లాలో భాగమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల జిల్లాలో రాజకీయ సమతౌల్యం మారనుంది. కుప్పం నియోజకవర్గంలో పెద్దగా మార్పులు లేకపోయినా, పలమనేరు నియోజకవర్గంలో మాత్రం కొన్ని భౌగోళిక మార్పులు జరిగే అవకాశం ఉంది. పెద్దపంజాణి మండలాన్ని తిరిగి పుంగనూరులో కలపడం వంటి మార్పులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
అలాగే పీలేరు, వాయల్పాడు నియోజకవర్గాలు మళ్లీ వేర్వేరుగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పాత రాజకీయ సమీకరణాలను తిరిగి తీసుకురానుంది. రిజర్వేషన్ వ్యవస్థలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్లో ఉండగా, భవిష్యత్తులో ఈ కేటగిరీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో వేపంజేరి, పలమనేరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్లో ఉండేవి. ఇప్పుడు కొత్త పునర్విభజనలో వాటి స్థితి మారే సూచనలు ఉన్నాయి.
అదనంగా మహిళా రిజర్వేషన్ అమలు దిశగా చర్యలు జరుగుతుండటంతో పలమనేరు నియోజకవర్గం మహిళలకు కేటాయించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు సుమారు 38 పెరిగే అవకాశాలు ఉండగా, లోక్సభ స్థానాల సంఖ్య కూడా పెరగనుంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా రాజకీయంగా మరింత ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. కొత్త నియోజకవర్గాల ఆవిర్భావం, రిజర్వేషన్ మార్పులు, పార్లమెంట్ స్థానాల పెరుగుదల ఇవన్నీ కలిపి జిల్లాలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే దిశగా సాగుతున్నాయి.
మొత్తంగా చూస్తే… చిత్తూరు జిల్లాలో రాబోయే రోజులు రాజకీయంగా అత్యంత కీలకంగా మారబోతున్నాయి. కొత్త నియోజకవర్గాల పుట్టుకతో కొత్త నాయకత్వం వెలుగులోకి రావడం, పాత రాజకీయ సమీకరణాలు చెదిరిపోవడం ఖాయం. జిల్లా రాజకీయ భవిష్యత్తును మలిచే ఈ పునర్వ్యవస్థీకరణపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
