శతాబ్ది వేడుకల సందడి…

శతాబ్ది వేడుకల సందడి…

ఏప్రిల్ 14న ‘స్వరనీరాజనం’ సంగీత విభావరి
యువతలో దేశభక్తి జ్వాల రగిల్చే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల సందర్భంగా కర్నూలు జిల్లాలో తొలిసారిగా “స్వరనీరాజనం” పేరుతో సంఘ గీతాలాపన సంగీత విభావరి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో దేశభక్తి భావనను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. శనివారం నగరంలోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి మందిర సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ న్యాయవాది ముద్దనూరు శ్రీధర్ మాట్లాడుతూ, 1925 నుంచి ప్రారంభమైన సంఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, దేశభక్తి గీతాలు సంస్థకు నూతన ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు.

ఆ గీతాల సారాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ “స్వరనీరాజనం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సంస్థ ఉపాధ్యక్షులు మాకం నాగరాజు మాట్లాడుతూ, సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సంస్కృత భారతి, కర్నూలు విభాగం ఆధ్వర్యంలో ఈనెల 14న (డా. బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు) సాయంత్రం 5.30 గంటలకు బి.క్యాంప్‌లోని శ్రీ టీ.జీ. లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం, ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సంగీత విభావరిలో సంఘ గీతాల ప్రత్యేక ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయని నిర్వాహకులు తెలిపారు. యువత, విద్యార్థులకు సంఘ భావజాలం, దేశభక్తి విలువలను పరిచయం చేయడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా, ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా. నరసరాం విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు.

అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్ ఏలే శ్యాం కుమార్ ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని నిర్వాహకులు విడుదల చేశారు. జిల్లాలోని ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యం.డీ.వై. రామశర్మ, సందడి మహేశ్వర్, మాళిగి భాను ప్రకాష్, బిలకంటి మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply