కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో మందులు…

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో మందులు…
ఎకొండూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన అన్ని రకాల మందులు,మాత్రలు అందుబాటులోకి వచ్చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.వేముల స్వాతి, డా.పి దివ్య తెలిపారు.గత కొద్ది రోజులుగా కిడ్నీ రోగులకు అవసరమైన రెండు రకాల మాత్రలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. సుహాసిని ఆదేశాల మేరకు ఆదివారం విజయవాడ నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను మూడు నెలలకు సరిపడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపినట్లు వారు వెల్లడించారు. ఆరోగ్య కేంద్రంలో మందులు అందుబాటులో లేవన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని డా.వేముల స్వాతి డా.పి దివ్య సూచించారు.
మండల పరిధిలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ప్రభుత్వం ద్వారా ఉచితంగా డయాలసిస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులను నిర్దిష్ట సమయానికి తీసుకోవాలని వారు సూచించారు.వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని,శరీరానికి తగినంత నీరు తీసుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
