K.Naga Babu | ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ నగర వాసులూ బాధితులే !

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి
భారత ప్రభుత్వం కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది
పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరూ మృతి చెందిన మన తోటి భారతీయులకు భరోసానివ్వాలి
నిజాంపేట నిరసన దీక్షలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ నగర వాసులూ బాధితులేనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. ఉగ్ర దాడుల ప్రభావం, దాని పర్యవసానానికి సంబంధించి హైదరాబాద్ నగర వాసులకు అవగాహన, అనుభవం ఉన్నదన్నారు.

గతంలో గోకుల్ చాట్, దిల్‍సుఖ్‍నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన దుశ్చర్యల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ రోదిస్తూనే ఉన్నారని, తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న వారు ఎందరో ఇంకా అదే భయంతో కొట్టుమిట్టాడుతున్నారని నాగబాబు స్పష్టం చేశారు.

జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ సంతాప దినాలు నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె.నాగబాబు గురువారం సాయంత్రం హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ… పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వెంటాడి మరీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరూ మృతి చెందిన మన తోటి భారతీయుల కుటుంబాలకు భరోసానివ్వాలని పిలుపునిచ్చారు.

Leave a Reply